సీబీఎస్‌ఈ ఇంగ్లిష్ పరీక్ష ప్యాసేజ్‌ను తప్పుబట్టిన సోనియా

సీబీఎస్‌ఈ ఇంగ్లిష్ పరీక్ష ప్యాసేజ్‌ను తప్పుబట్టిన సోనియా

సీబీఎస్‌ఈ టెన్త్‌ క్లాస్‌ పరీక్షలో ఇచ్చిన ఓ ప్రశ్న వివాదానికి దారి తీసింది. ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ ప్యాసేజీలో మహిళలను కించపరిచేలా ఉండడంతో ప్రతిపక్షాలు దానిని తప్పుబట్టాయి. దీనిపై లోక్‌సభలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ నిరసన వ్యక్తం చేశారు. మహిళలను అవమానించేలా సీబీఎస్‌ఈ పరీక్షల్లో ప్యాసేజ్‌ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఆ ప్యాసేజ్‌ను పరీక్ష నుంచి తొలగించడంతో పాటు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇటువంటివి మరోసారి పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యా శాఖను ఆమె కోరారు. అయితే సోనియా డిమాండ్‌పై సభలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రాకపోవడంతో నిరసనగా కాంగ్రెస్, డీఎంకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. 

బీజేపీ, ఆర్‌‌ఎస్‌ఎస్ పని

సాధారణంగా సీబీఎస్‌ఈ పరీక్ష పేపర్లు చాలా కఠినంగా ఉంటాయని, కానీ ఇంగ్లిష్ పరీక్షలో ఇచ్చిన కాంప్రహెన్షన్ ప్యాసేజ్‌ మాత్రం చాలా అసహ్యకరంగా ఉందంటూ కాంగ్రెస్ ఎంపీ  రాహుల్ ట్వీట్ చేశారు. యువత నైతికతను, భవిష్యత్తును దెబ్బతీసే ఉద్దేశంతో కావాలని బీజేపీ, ఆర్‌‌ఎస్‌ఎస్‌ కలిసి చేసిన ప్రయత్నమిది అని అన్నారు. కష్టపడి శ్రమిస్తే ఏదైనా సాధించవచ్చని, కానీ మూఢ విశ్వాసాలతో ఏం జరగదని యువత, పిల్లలకు ఆయన పిలుపునిచ్చారు.

వివాదం కావడంతో తొలగింపు.. ఫుల్ మార్కులు

ఇంగ్లిష్ కాంప్రహెన్షన్‌ ప్యాసేజ్‌ వివాదాస్పదం కావడం, దానిని సోనియా గాంధీ లోక్‌సభలో ప్రస్తావించడంతో ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే సీబీఎస్‌ఈ ఆ ప్రశ్నను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ ప్యాసేజ్‌కు విద్యార్థులందరికీ పూర్తి మార్కులు ఇస్తామని వెల్లడించింది. అయితే వివాదానికి కారణమైన ఆ ప్యాసేజీలో భర్త మార్గాన్ని అనుసరించడం ద్వారానే భార్య తన పిల్లల నుంచి గౌరవం పొందుతుందని ఉంది. అలాగే సమాజంలో, కుటుంబాల్లో సమస్యలకు ప్రధాన కారణం.. మహిళలకు స్వతంత్రత పెరగడమేనని అందులో ఉంది. దీంతో ఈ రకమైన ప్యాసేజ్ పరీక్ష పేపర్‌‌లో పెట్టడాన్ని తప్పుబడుతూ వివాదం చెలరేగింది.