న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్కూళ్లలో 9, 10 తరగతుల విద్యార్థులకు త్రిభాషా విధానం తప్పనిసరికానుంది. ఎన్ఈపీ 2020, ఎన్‌సీఎఫ్-ఎస్‌ఈ 2023 మార్గదర్శకాలకు అనుగుణంగా 2026–27 విద్యా సంవత్సరం నుంచి మూడు భాషల (ఆర్1, ఆర్2, ఆర్3) బోధనను తప్పనిసరి చేస్తూ సీబీఎస్ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ నూతన విధానం 2026 జులై 1 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. విద్యార్థులు ఎంచుకునే మూడు భాషల్లో కనీసం రెండు కచ్చితంగా స్వదేశీ భాషలై ఉండాలి. ఒక విదేశీ భాషను ఎంచుకోవాలంటే మిగిలిన రెండూ భారతీయ భాషలే అయి ఉండాలి. లేదంటే దానిని కేవలం అదనంగా నాలుగో భాషగా మాత్రమే చదువుకోవాలి. అలాగే కొత్త విధానంతో తలెత్తే టీచర్ల కొరతను అధిగమించడానికి రిటైర్డ్ టీచర్ల నియామకం, హైబ్రిడ్ బోధన, స్కూళ్ల మధ్య రిసోర్స్ షేరింగ్‌కు బోర్డు అనుమతించింది.
