బిల్డప్ టెక్కీలకు బుద్ధి వచ్చేలా.. బెంగళూరు ఐటీ జంట నెలవారీ బడ్జెట్ వీడియో వైరల్: వెర్రీ రీజనబుల్

బిల్డప్ టెక్కీలకు బుద్ధి వచ్చేలా.. బెంగళూరు ఐటీ జంట నెలవారీ బడ్జెట్ వీడియో వైరల్: వెర్రీ రీజనబుల్

బెంగళూరులో బతకడం అంటే సామాన్యమైన విషయం కాదు. పెరిగిన రెంట్లు, కాస్ట్ ఆఫ్ లివింగ్‌తో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతుంటాయి. ఇలాంటి టైమ్‌లో బెంగళూరులో నివసిస్తున్న ఒక ఐటీ జంట తమ నెలవారీ ఖర్చుల చిట్టాను విడమరచి చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రిమోట్ సీనియర్ డేటా ఇంజనీర్‌గా పనిచేస్తున్న అనురాగ్ శ్రీవాస్తవ, తన భార్యతో కలిసి నెలకు ఎంత ఖర్చు చేస్తున్నారో పైసా పైసాతో సహా లెక్కగట్టి చూపించారు. ఇందులో ఎలాంటి EMIలు, ఇన్వెస్ట్‌మెంట్లు కలపలేదని వారు ముందే చెప్పారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. బెంగళూరులో ఇంత తక్కువ ఖర్చుతో బతికేస్తున్నారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ జంట షేర్ చేసిన నెలవారీ బడ్జెట్‌లో ఎక్కువ భాగం ఇంటి అద్దెకే సరిపోతోంది. బెంగళూరులో 2BHK అపార్ట్‌మెంట్‌కు రూ.20వేలు రెంట్ కడుతున్నారు. ఇదే తమకు అన్నిటికంటే పెద్ద ఖర్చని వారు చెప్పుకొచ్చారు. అయితే రెంట్‌తో సమానంగా కిరాణా సామాన్లు, కూరగాయల కోసం కూడా మరో రూ.20వేలు ఖర్చు చేయడం గమనార్హం. తాము హెల్తీ ఫుడ్, హై-ప్రోటీన్ డైట్ ఫాలో అవుతామని.. అందుకే ఖర్చు అంత ఎక్కువగా ఉందని వివరించారు. ఇక ఇల్లు ఊడ్చి, తుడవడానికి నెలకు రూ.2వేల 500 మేర హౌస్ హెల్ప్‌కు ఇస్తున్నట్లు వెల్లడించారు.

మిగతా ఖర్చుల విషయానికి వస్తే.. ఇద్దరూ ఇంటి నుంచే పని చేయడం వల్ల డైలీ ఆఫీస్ ప్రయాణ ఖర్చులు చాలా వరకు మిగిలాయి. అయినా సరే బైక్ పెట్రోల్‌కు రూ.2వేలు, అప్పుడప్పుడు క్యాబ్ జర్నీల కోసం మరో రూ.2వేలు ఖర్చవుతోందట. ఇక వీకెండ్స్‌లో సరదాగా బయటకు వెళ్లడానికి, హోటల్ తిళ్లకు రూ.5వేలు కేటాయించారు. ఇంట్లోనే ఉండి ఎంటర్‌టైన్‌మెంట్ ఎంజాయ్ చేయడానికి OTT యాప్స్ సబ్‌స్క్రిప్షన్ల కోసం నెలకు రూ.2వేలు, వాటర్ బిల్లు యావరేజ్‌గా రూ.700 వస్తోంది. మొత్తంగా చూస్తే ఈ జంటకు నెలకు రూ.54వేల 200 ఖర్చు చేస్తోంది ప్రతి నెల బెంగళూరులో నివసించటానికి. 

ఈ ఖర్చుల వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గతంలో కొందరు బెంగళూరులో నెలకు లక్షల్లో ఖర్చవుతుందని బిల్డప్ ఇచ్చారని.. మొదటిసారి చాలా ప్రాక్టికల్‌గా, జెన్యూన్‌గా ఉండే బడ్జెట్ చూశామని కొందరు మెచ్చుకున్నారు. బెంగళూరు లాంటి సిటీలో ఇద్దరు మనుషులకు రూ.54వేలు అంటే చాలా అఫోర్డబుల్ అని కామెంట్స్ చేశారు. అయితే మరికొందరు మాత్రం ఈ లెక్కల్లో లొసుగులను వెతికారు. బట్టలు, హాస్పిటల్ బిల్లులు, మొబైల్ రీఛార్జ్ లు, బైక్ సర్వీసింగ్, ఊరెళ్లడానికి అయ్యే ఖర్చులు, పేరెంట్స్‌కు పంపే డబ్బులు ఎక్కడ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ మిడిల్ క్లాస్ ఐటీ జంట బడ్జెట్ ప్లానింగ్ ఇప్పుడు చాలా మందిని ఆలోచింపజేస్తోంది. అనవసరపు ఖర్చులు చేస్తూ అబ్బే డబ్బులు అస్సలు సరిపోవట్లే అంటూ బిల్డంప్ ఇచ్చే టెక్కీలు వీరిని చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు.