- మొదట రూ.10 వేలకు రూ.16 వేలు
- తర్వాత రూ.20వేలకు రూ.40 వేలు
- మూడోసారి ముంచిన్రు
పద్మారావునగర్, వెలుగు : సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన ఓ గృహిణిని పార్ట్‌టైం జాబ్అంటూ సైబర్ కేటుగాళ్లు బోల్తా కొట్టించారు. హోటల్స్‌కు ఆన్లైన్ రివ్యూలు ఇచ్చే పార్ట్‌టైమ్ ఉద్యోగం ఉందని, అలాగే అదనపు టాస్కుల కోసం పెట్టుబడులు పెడితే భారీ లాభాలంటూ ఆశచూపి సుమారు రూ. 6లక్షలకు పైగా నగదు కొట్టేశారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. వారాసిగూడకు చెందిన 39 ఏళ్ల మహిళకు సెప్టెంబర్ 9న టెలిగ్రామ్‌లో పూజా అనే గుర్తుతెలియని వ్యక్తి నుంచి మెసేజ్వచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్‌లు, ఫీడ్‌బ్యాక్ ఇచ్చే ఆన్లైన్ పార్ట్‌టైమ్ జాబ్ ఉందని నమ్మించి ఆమెను 'BVLGARI 5471' అనే టెలిగ్రామ్ గ్రూప్‌లో చేర్చారు.
మొదట్లో 30 రివ్యూలు పూర్తి చేయడంతో ఆమె ఖాతాకు ₹720 జమ చేశారు. అదనపు టాస్కుల కోసం రూ.10 వేలు పెట్టుబడి పెట్టించి..అసలుతో పాటు లాభం కలిపి రూ.16,434 తిరిగి ఇచ్చారు. తర్వాత వీఐపీ లెవెల్స్ టాస్క్ పేరిట మరో రూ.20వేలు కట్టించుకుని రూ.39,810 చెల్లించి పూర్తి నమ్మకం కలిగేలా చేశారు. సంస్థ వార్షికోత్సవం ఆఫర్ అంటూ రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు వస్తాయని ఆశ చూపించారు. నిజమని నమ్మిన ఆమె నగదు బదిలీ చేసింది.
తర్వాత మిస్టరీ బాక్స్ ఓపెన్ అయ్యిందని, రూ. 12 లక్షలు వచ్చాయని, అవి ఇవ్వాలంటే అదనంగా డబ్బులు చెల్లించాలని నమ్మబలికారు. దీంతో ఆమె విడతల వారీగా మొత్తం ₹6,23,232 బదిలీ చేసింది. తర్వాత కూడా ఇంకా నగదు చెల్లిస్తేనే డబ్బులు డ్రా చేసుకోగలరని చెప్పడంతో మోసపోయినట్లు గ్రహించి ఫిర్యాదు చేసింది. ఇన్స్పెక్టర్ జి. సంజీవ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
