Childrens story: మునగ చెట్టు పంచాయతీ.. ఇరుగు పొరుగు వారు స్నేహితుల్లా ఉండాలి..

Childrens story: మునగ చెట్టు పంచాయతీ.. ఇరుగు పొరుగు వారు స్నేహితుల్లా ఉండాలి..

రామాపురం అనే గ్రామంలో శివయ్య అనే రైతు ఉండేవాడు. అతని ఇంటి పెరటిలో ఒక పెద్ద మునగ చెట్టు ఉండేది. గ్రామంలో ఎవరికి అవసరమైనా శివయ్య ఆ మునక్కాయలను ఉచితంగా ఇస్తుండేవాడు. ఒకరోజు శివయ్యకు ఆ చెట్టు వల్లే సమస్య వచ్చింది.

 దాంతో గ్రామాధికారిని కలిసి “అయ్యా! మా పెరటిలో మునగ చెట్టు ఉంది. మా ఇంటి పక్కన ఉండే భూషయ్య అతని ఇంట్లోకి దాని ఆకులు రాలి  పడుతున్నాయని, గొంగళి పురుగులు వస్తున్నాయని చెట్టును కొట్టెయ్యమంటున్నాడు. పక్క పక్క ఇళ్లు అన్నాక ఒకరి ఇంట్లో చెట్ల ఆకులు మరొకరి ఇంట్లో రాలడం సహజం.. నేను వేప గింజల పొడి, పసుపు నీళ్లలో కలిపి పోయడం వల్ల గొంగళి పురుగులు రావడం లేదు. కానీ, అతను నా మీద అన్యాయంగా నిందలు మోపుతున్నాడు. మీరే నాకు న్యాయం చేయాలి” అన్నాడు శివయ్య. 

“సరే నువ్వు వెళ్లు ఈ విషయం నేను చూసుకుంటాను” అని శివయ్యకు ధైర్యం చెప్పి పంపించాడు గ్రామాధికారి.  ఆరోజు సాయంత్రం గ్రామాధికారి భూషయ్య ఇంటికి వెళ్లాడు. “అయ్యా! నమస్కారం..” అన్నాడు భూషయ్య. “నమస్కారం భూషయ్యా... ఒక చిన్న పని ఉండి ఇటువైపు వచ్చాను. ఎలాగూ ఇంతదూరం వచ్చాను కదా.. మీ ఇల్లు చూద్దాము పద” అన్నాడు గ్రామాధికారి. 
భూషయ్య గ్రామాధికారిని సంతోషంగా ఇంటిలోకి ఆహ్వానించాడు. భూషయ్య ఇంటిలోనికి వెళ్తూ పెరటి వైపు కలియతిరిగి, మెట్లు ఎక్కి మేడ పైకి వెళ్లాడు. పక్కనున్న శివయ్య ఇంటిని, పెరడుని పరిశీలనగా గమనించాడు గ్రామాధికారి.  మునగ చెట్టు కొమ్మలకు మునక్కాయలు వేలాడుతున్నాయి. అవి  భూషయ్య మేడపై నుంచి చాలా సులువుగా కోసుకోవచ్చు. కిందికి వచ్చి “ఆకలిగా ఉంది మీ ఇంట్లో భోజనం చేసి వెళ్తాను” అన్నాడు గ్రామాధికారి. 

“అయ్యా, ఉండండి ఇప్పుడే వడ్డిస్తాను” అని భూషయ్య వంటింట్లోకి వెళ్లి భార్యతో చెప్పాడు. ఆమె వెంటనే తినడానికి ఏర్పాట్లు చేసింది. విస్తరి వేసి అన్నం, మునక్కాయల పులుసు వడ్డించింది. “మునక్కాయల పులుసు. చాలా రుచిగా ఉంది” అన్నాడు గ్రామాధికారి.  “వాటిని వీధి చివరలో ఉన్న కూరల కొట్టులో కొన్నాను” అన్నాడు భూషయ్య. “అలాగా! మంచి భోజనం పెట్టినందుకు కృతజ్ఞతలు. రేపు ఉదయం ఒకసారి మా ఇంటికి రా” అని భూషయ్యకు చెప్పి బయలుదేరాడు. మరుసటి రోజు భూషయ్య గ్రామాధికారి ఇంటికి వెళ్లాడు. ‘‘అయ్యా! ఇవాళ ఇంటికి రమ్మని పిలిచారు. విషయం ఏంటో చెప్తారా?’’ అని అడిగాడు భూషయ్య.

►ALSO READ | ఆధ్యాత్మికం : కృషి పట్టుదల మాత్రమే సరిపోదు.. విజయం సాధించాలంటే దైవానుగ్రహం కావాలి..!

“ఏం లేదు భూషయ్య.. నిన్నటి మునగకాయల పులుసు గురించి మాట్లాడదామని పిలిచాను’’ అన్నాడు వెటకారంగా. భూషయ్యకు ఏమీ అర్థం కాక దిక్కులు చూశాడు. ‘‘చూడు భూషయ్యా.. నిన్న నేను మీ ఇంటికి వచ్చినప్పుడు శివయ్య ఇంటిని కూడా పరిశీలించి చూశా. వాళ్ల ఇంటి పెరట్లో ఉన్న మునగ చెట్టుకు గొంగళి పురుగులు కనిపించలేదు. నువ్వు పెంచుతున్న బాదం చెట్టు ఆకులు శివయ్య ఇంట్లో పడడం నేను చూశా. చెట్ల ఆకులు పక్క ఇళ్లలో పడడం సహజం కనుక అతను ఎప్పుడూ నీమీద ఆరోపణలు చేయలేదు. అంతేకాదు.. అతని చెట్టు మునక్కాయలు అడగకుండా కోసుకుని, నేను అడిగితే కొన్నాను అని నాకు అబద్ధం చెప్పావు. అలాంటప్పుడు అతన్ని చెట్టు కొట్టేయమనడం సమంజసంగా ఉందా? ఊర్లో ఎవ్వరూ మునక్కాయలు అమ్మరు. ఎవరికైనా కావాలన్నా శివయ్య ఉచితంగా ఇస్తాడు” అన్నాడు.

‘‘అయ్యా! అది... అది...” అని నీళ్లు నమలసాగాడు భూషయ్య. “తప్పును ఒప్పుకో.. లేకపోతే విషయం రాజు గారి వరకు వెళ్తుంది” అన్నాడు గ్రామాధికారి. “తప్పయ్యింది అయ్యా.. క్షమించండి!” అన్నాడు భూషయ్య. 
“ఇంకోసారి ఇలా జరగకూడదు” అని భూషయ్యను గట్టిగా మందలించాడు గ్రామాధికారి.

‌‌‌‌ - యు. విజయశేఖర రెడ్డి

మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతో పాటు  featureseditor@v6velugu.com   కి మెయిల్​ చేయండి.