ఆధ్యాత్మికం : కృషి పట్టుదల మాత్రమే సరిపోదు.. విజయం సాధించాలంటే దైవానుగ్రహం కావాలి..!

ఆధ్యాత్మికం : కృషి పట్టుదల మాత్రమే సరిపోదు.. విజయం సాధించాలంటే దైవానుగ్రహం కావాలి..!

ఒక పనిని ప్రారంభించడం తేలికే కానీ, ఆ పనిని పరిపూర్ణం చేసుకోవడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. కృషి, పట్టుదల, స్థిరత్వం, పని పట్ల నిబద్ధత ఇవన్నీ ఉంటే ఎంతటి కష్టమైన పనినైనా పూర్తిచేయగలం. అయితే ఇందుకు మానవ ప్రయత్నం మాత్రమే సరిపోదు, దైవానుగ్రహం పరిపూర్ణంగా లభించాలి.. అంటారు పెద్దలు.

 దైవం అనే పదాన్ని  ‘మానవాతీతమైన శక్తి’ అని అర్థం చేసుకోవాలి. అంతా మన చేతుల్లోనే ఉంటే, ఏ పనినైనా మనకు నచ్చినట్లుగా చేసుకోగలం. శ్రీరామచంద్రుడికి దశరథుడు పట్టాభిషేకం చేయాలనుకుని ముహూర్తం నిశ్చయించాడు. కానీ.. అందుకు దైవం అనుకూలించలేదు. పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం అనంతరం రాముడికి పట్టాభిషేకం జరిగింది. దేనికైనా దైవానుగ్రహం తప్పనిసరిగా ఉండాలి.

ఆంధ్ర పురాణంలో ఒక కథ ఉంది. శర్వవర్మ అనే మంత్రి హాలమహారాజుకి ఆరునెలల్లో వ్యాకరణ శాస్త్రం సంపూర్ణంగా నేర్పుతానని శపథం చేస్తాడు. కానీ, పదిహేను సంవత్సరాల పాటు చదవవలసిన శాస్త్రాన్ని ఆరు నెలల్లో పూర్తిచేయడానికి దైవానుగ్రహం ఉండి తీరాలని భావిస్తాడు.

అలవు చలం బచంచలములై యలవడ్డ యుపాసనా మహా
బలమున గాని, యీ పనికి బాల్పడ గెల్పు ఘటిల్లదెన్నడున్‌‌
దలకొను దీక్షయున్‌‌ మనసు దప్పని శిక్షయు నూది షణ్ముఖున్‌‌
గెలిచెద గాక కోర్కి సమకూరగ నిల్చెదగాక వీకమై.

‘‘కృషి, పట్టుదల నిశ్చలంగా నిలబడాలి. నిరంతరం నేను చేసే దైవారాధన మరింత గట్టిగా చేయాలి. అలా కాకుండా వ్యాకరణ పఠనానికి పూనుకొంటే ఎట్టి పరిస్థితిలోను గెలుపు రాదు. నియమం, ఏకాగ్రతలతో కుమారస్వామిని తప్పకుండా అర్చిస్తాను. అపుడు సంకల్పం సిద్ధించి సగర్వంగా తలయెత్తుకొని నిలబడతాను’’ అనుకుంటాడు శర్వవర్మ.
(మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి రచించిన ‘ఆంధ్ర పురాణము, శాతవాహనపర్వము’ 127 వ పద్యం)

మహాభారతంలో వినతకద్రువల కథ తెలిసిందే. వినతకద్రువలు అక్కచెల్లెళ్లు. వినత కుమారుడు గరుత్మంతుడు. కద్రువ కుమారులు పాములు. వినతకద్రువల మధ్య ఒక వాదం జరిగినప్పుడు వినత పరాజయం పాలవుతుంది. ఓడిపోయిన వారు గెలిచిన వారికి దాస్యం చేయాలనేది ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారం వినత కద్రువకు దాసిగా ఉంటుంది. గరుత్మంతుడు కూడా కద్రువ సంతానమైన పాములకు దాస్యం చేస్తుంటాడు. 

ఇలా జీవితం గడపటం నచ్చని గరుత్మంతుడు... తన తల్లికి దాస్యవిముక్తి కలగాలంటే ఏమి చేయాలని ప్రశ్నిస్తాడు. అందుకు కద్రువ, ‘నువ్వు అమృత భాండాన్ని తీసుకువస్తే, నీ తల్లికి దాస్యవిముక్తి కలుగుతుంది’ అని పలికింది. అమృతాన్ని తీసుకురావడం ఎంతో కష్టంతో కూడుకున్న పని అని తెలిసినప్పటికీ, తన తల్లికి దాస్య విముక్తి కలిగించాలనే సంకల్పంతో, పట్టుదలతో, దీక్షతో అమృతాన్ని సాధించాడు గరుత్మంతుడు. అలా తల్లికి దాస్యవిముక్తి చేశాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకు వాహనమయ్యాడు.

ధృవుడు.. ఆకాశంలో నేటికీ మనం ధృవ నక్షత్రం చూస్తుంటాం. ఆ కథ ఒకసారి పరిశీలిద్దాం...అనగనగా ఉత్తానపాదుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయనకు సునీతి, సురుచి అని ఇద్దరు భార్యలు. పెద్ద భార్య అయిన సునీతి కుమారుడు ధృవుడు. ఒకనాడు ధృవుడు తన తండ్రి ఒడిలో కూర్చుంటుండగా సురుచి అక్కడకు వచ్చి, ‘నీ తండ్రి ఒడిలో కూర్చోవాలంటే నువ్వు తపస్సు చేసి రావాలి’ అంటుంది. వెంటనే ఆ బాల ధృవుడు తల్లి అనుమతితో అడవులకు వెళ్లి దీక్షతో, పట్టుదలతో తపస్సు చేశాడు. 

మంచినీళ్లు తాగకుండా, ఏమీ తినకుండా, నారాయణ మంత్రం జపిస్తూ ఒంటి కాలి మీద కఠోర తపస్సు చేశాడు. నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఆకాశంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చి, తండ్రి ఒడిలో కూర్చున్నాడు. ఇంత సాధించడానికి ధృవుడికి కృషి, పట్టుదలతో పాటు, దైవానుగ్రహం కూడా తోడయ్యింది. 

భగీరథుడు.. గంగానదిని నేల మీదకు తీసుకురావడానికి భగీరథుడు ఎంత ప్రయత్నం చేశాడో తెలిసిందే. ఇప్పటికీ ఎవరైనా అసాధ్యమైన పనిని పట్టుదలతో సాధించుకుంటే భగీరథ ప్రయత్నం అనడం పరిపాటిగా మారింది. హనుమంతుడు.. నూరు యోజనాల సముద్రాన్ని లంఘించి, లంకకు చేరి,  కఠోర దీక్షతో, పట్టుదలతో సీతమ్మను కనుగొనగలిగాడు.లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి దీక్ష, కృషి, పట్టుదల ఉంటే.. దైవానుగ్రహం తప్పక లభించి తీరుతుందని ఈ ఉదాహరణలన్నీ మనకు తెలియజేస్తున్నాయి.

- డా. పురాణపండ వైజయంతి

మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు featureseditor@v6velugu.com కి మెయిల్​ చేయండి.