CBSE ఆన్ స్క్రీన్ మార్కింగ్ (OSM) సిస్టమ్ కాంట్రాక్టు వ్యవహారంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌కు చెందిన కోఎంప్ట్(COEMPT) ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కాంట్రాక్టు కట్టబెట్టేందుకు సీబీఎస్ఈ టెక్నికల్ వ్యాల్యూస్ ను దశలవారీగా తగ్గించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కోఎంప్ట్ సంస్థకు కాంట్రాక్టు ఇవ్వమని ఎవరు కోరుకున్నారు? ఈ కంపెనీ కోసం ప్రమాణాలను ఎవరు తగ్గించారు?” అంటూ రాహుల్ గాంధీ కేంద్రాన్ని నిలదీశారు.
రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో చేసిన పోస్టులో.. సీబీఎస్ఈ మూడు సార్లు టెండర్లు పిలిచిందని తెలిపారు. మొదటి సారి ఒక్క బిడ్ కూడా రాలేదని, రెండోసారి అర్హత సాధించిన సంస్థలే లేవని చెప్పారు. చివరకు కోఎంప్ట్ అర్హత సాధించే వరకు టెక్నికల్ ప్రమాణాలను తగ్గించారని ఆరోపించారు. స్కానింగ్ రిజల్యూషన్‌ను తగ్గించడం, రోబోటిక్ స్కానర్ నిబంధన తొలగించడం, సీఎంఎంఐ సర్టిఫికేషన్‌ను లెవెల్-5 నుంచి లెవెల్-3కు తగ్గించడం, జవాబు పత్రాల్లో తప్పులకు జరిమానాలను తొలగించడం వంటి మార్పులు చేశారని అన్నారు ప్రతిపక్ష నేత.
భారతదేశపు ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ కూడా మూడో రౌండ్‌లో అర్హత సాధించినప్పటికీ, కాంట్రాక్టు కోఎంప్ట్(COEMPT)కు ఎలా దక్కిందని రాహుల్ ప్రశ్నించారు. ‘‘కోఎంప్ట్ కు బిడ్ రావాలని ఎవరు కోరుకున్నారు? ఈ కంపెనీ కోసం ప్రమాణాలను ఎవరు తగ్గించారు?” అంటూ రాహుల్ గాంధీ కేంద్రాన్ని నిలదీశారు.
CBSE టెండర్ల విషయంలో “నియమబద్ధమైన ప్రక్రియనే అనుసరించాం” అన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలపై కూడా రాహుల్ గాంధీ స్పందిస్తూ “అది సమాధానం కాదు. పనిని సమర్థంగా చేయగల సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారా లేదా అనేదే అసలు ప్రశ్న” అని అన్నారు.
ఇదిలా ఉండగా, 12వ తరగతి బోర్డు పరీక్షల మూల్యాంకనంలో వేలాది అస్పష్టమైన స్కాన్‌లు, జవాబు పత్రాల సరిపోలిక లోపాలు బయటపడటంతో కోఎంప్ట్(COEMPT)పై భారీ జరిమానా విధించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర న్యాయ విచారణ జరపాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
