చెన్నూర్‌, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీలలో.. రూ.112 కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి వివేక్ వెంకటస్వామి

చెన్నూర్‌, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీలలో.. రూ.112 కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి వివేక్ వెంకటస్వామి
  •     చెన్నూరు, క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల్లో జోరుగా పనులు
  •     పార్కుల డెవలప్​మెంట్, మినీ ట్యాంక్​బండ్​ బ్యూటిఫికేషన్
  •     ఇటీవల శంకుస్థాపనలు చేసి పనులు స్టార్ట్ చేసిన మంత్రి వివేక్
  •     మార్నింగ్ వాక్​లో సమస్యలు చూసి అభివృద్ధికి నిధులు విడుదల 
  •     మరో రూ.110 కోట్లతో కొనసాగుతున్న అమృత్ స్కీమ్​ పనులు

మంచిర్యాల, వెలుగు:  చెన్నూర్​ నియోజకవర్గంలోని చెన్నూర్, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా వాడవాడలా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంపై ఎమ్మెల్యే, మంత్రి వివేక్ వెంకటస్వామి ఫోకస్ పెట్టారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదం కోసం పార్కుల అభివృద్ధి, మినీ ట్యాంక్​బండ్​ల బ్యూటిఫికేషన్​తో పాటు రోడ్ల విస్తరణపై దృష్టి సారించారు. ఈ పనుల కోసం ఇటీవల వివిధ స్కీమ్​ల కింద రూ.112.24 కోట్ల ఫండ్స్ రిలీజ్ చేయించారు. 

ఇప్పటికే కొన్ని పనులకు టెండర్లు పూర్తికాగా, మరికొన్ని టెండర్ దశలో ఉన్నాయి. ఈ నెల 14,15,16,19 తేదీల్లో మంత్రి వివేక్ మూడు మున్సిపాలిటీల పరిధిలో శంకుస్థాపనలు చేసి అభివృద్ధి పనులు ప్రారంభించారు. వాడవాడలా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు షురూ కావడంతో ఆయా కాలనీల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పనుల వివరాలు ఇవీ.. 

  • మందమర్రి మున్సిపాలిటీకి అర్బన్​ఇన్​ఫ్రాస్ట్రక్చర్​డెవలప్​మెంట్​ ఫండ్(యూఐడీఎఫ్) కింద రూ.18 కోట్లు మంజూరయ్యాయి. నాలుగు ప్యాకేజీలుగా చేపడుతున్న ఈ పనులకు టెండర్లు పూర్తయ్యాయి. తెలంగాణ అర్బన్​ఫైనాన్స్​అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​డెవలప్​మెంట్(టీయూఎఫ్​ఐడీసీ) కింద మరో రూ.24.40 కోట్లు కేటాయించారు. ఈ పనులకు త్వరలోనే టెండర్లు నిర్వహించనున్నారు. 
  • చెన్నూరు​ మున్సిపాలిటీలో టీయూఎఫ్​ ఐడీసీ కింద  రూ.23.84 కోట్లు ప్రభుత్వం సాంక్షన్ చేసింది. ఈ నిధులతో మొత్తం 18 పనులు చేపడుతున్నారు. అంతేగాకుండా యూఐడీసీ కింద రూ.15 కోట్లతో మరో ఐదు పనులు జరుగుతున్నాయి. 
  • క్యాతనపల్లి మున్సిపాలిటీకి యూఐడీఎఫ్ ​కింద మూడు ప్యాకేజీలకు రూ.15 కోట్లు సాంక్షన్ అయ్యాయి. టీయూఎఫ్​ ఐడీసీ కింద మరో రూ.10 కోట్లతో ఆరు ప్యాకేజీల్లో వివిధ పనులను చేపడుతున్నారు. ఇప్పటికే నాలుగింటికి టెండర్లు పూర్తయ్యాయి. 
  • ఇవేకాకుండా డిస్ట్రిక్ట్ ​మినరల్ ఫండ్​ట్రస్ట్(డీఎంఎఫ్టీ), కమ్యూనిటీ సోషల్ ​రెస్సాన్సిబిలిటీ(సీఎస్ఆర్) కింద మరో రూ.5 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ సిస్టమ్, చెన్నూర్​లో రోడ్డు వైడెనింగ్, పార్కుల డెవలప్​మెంట్, మందమర్రిలో మినీ ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ తదితర పనులు చేపడుతున్నారు. మొత్తం 112.24 కోట్లతో చేపడుతున్న ఈ పనులు పూర్తయితే మూడు మున్సిపాలిటీల్లోని గల్లీ రోడ్ల స్వరూపమే మారిపోతుంది.

రూ.110 కోట్లతో అమృత్ పనులు

చెన్నూర్​, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో రూ.110 కోట్లతో అమృత్​స్కీమ్ పనులు కొనసాగుతున్నాయి. పట్టణాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మంత్రి వివేక్​వెంకటస్వామి వాటర్​సప్లై స్కీమ్​లకు భారీగా నిధులు కేటాయించారు. అమృత్​పనులు ఇప్పటికే 70 శాతం వరకు పూర్తయ్యాయి. మూడు నెలల్లో మిగతా పనులు కంప్లీట్​చేసి రానున్న ఎండాకాలంలో తాగునీటి కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

మార్నింగ్ వాక్​ చేసి.. సమస్యలు చూసి.. 

మంత్రి వివేక్​ వెంకటస్వామి చెన్నూర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మార్నింగ్​ వాక్ ​కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇలా చెన్నూరు, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లోని దాదాపు అన్ని వార్డుల్లో మంత్రి మార్నింగ్​ వాక్ ​చేశారు. దీంతో ఆయా వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలతో పాటు ఇతర సమస్యలపై ఆయనకు పూర్తిగా అవగాహన వచ్చింది. ఈ మేరకు ప్రాధాన్యత క్రమంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు భారీగా నిధులు కేటాయించారు.