సీఏఏ అమలుపై స్టే విధించాలని పిటీషన్లు సుప్రీం కోర్టులో మార్చి 19న విచారణ

సీఏఏ అమలుపై స్టే విధించాలని పిటీషన్లు సుప్రీం కోర్టులో మార్చి 19న విచారణ

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై స్టే విధించాలంటూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలైయ్యాయి. వాటిని విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మార్చి 19న పిటీషన్లపై విచారణ జరపనున్నట్లు శుక్రవారం (మార్చి 15)న వెల్లడించింది. సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు ఆ చట్టం అమలును నిలిపివేయాలని కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇటీవల అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది.

సీఏఏ అమలుపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం, వివక్షాపూరితమైందంటూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌ (IUML) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చట్టం అమలును నిలిపివేయాలని తన పిటిషన్‌లో పేర్కొంది. అలాగే అత్యవసర విచారణ చేపట్టాలని కోరింది. సీఏఏ బిల్లుపై మొత్తం 237 కేసులు ఉన్నాయని వాటన్నింటినీ మార్చి 19న విచారిస్తాం అన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ పిటిషనర్‌ల తరఫు న్యాయవాదులకు తెలిపారు.