రాష్ట్రవ్యాప్తంగా ధరణిపై ప్రత్యేక సదస్సులు.. గైడ్ లైన్స్ జారీ

రాష్ట్రవ్యాప్తంగా ధరణిపై ప్రత్యేక సదస్సులు.. గైడ్ లైన్స్ జారీ

ధరణి సమస్యలను పరిష్కరించేందుకు రేపటి నుంచి వచ్చే  నెల 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు తాజాగా మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. తహసీల్దార్, ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్లు, కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశారు. మార్చి 1 నుంచి 9 వరకూ అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్లకు సీసీఎల్ఏ కమిషనర్ మార్గదర్శకాలు విడుదల చేశారు. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయో మార్గదర్శకాల్లో వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 2,45,037 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. పట్టాదారు పాసుపుస్తకాల్లో డేటా కరెక్షన్‌ కోసం ధరణిలో లక్షకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. వీటన్నింటినీ పరిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్ అవసరమని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దరఖాస్తు దారుల ఫోన్ నెంబర్లకు వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం వెంటనే చేరవేయాలి అని ఆదేశాల్లో పేర్కొంది. అప్లికేషన్లను క్లియర్ చేసే ముందు ప్రభుత్వ రికార్డులో వాటి వివరాలను తప్పనిసరిగా చెక్ చేయాలని ప్రభుత్వం సూచించింది.  ఈ నెల 24న ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన రివ్యూలో కీలకమైన చర్చ జరిగింది. ఈ సందర్బంగా పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. 

ఆధార్‌ నెంబర్‌ మిస్‌ మ్యాచ్‌, రైతుల పేర్లు తప్పుగా ప్రచురించబడి ఆగిపోయిన దరఖాస్తులు, ఫొటో మిస్‌ మ్యాచ్‌ వంటి పెండింగ్‌ అప్లికేషన్లను సత్వరమే పరిష్కరించాలని, సరిచేసిన దరఖాస్తుల వివరాలు ఆన్‌లైన్‌ చేయాలని సూచించారు. ప్రభుత్వ భూముల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, అసైన్డ్‌ భూముల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. టైం లైన్ విధించి ఆ లోపు పెండింగ్ అప్లికేషన్లను క్లియర్ చేయాలని ఆదేశించారు. వెంటనే ఆన్ లైన్ లో అప్డేట్ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ఉత్తర్వులు వెలువడ్డాయి.