హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా నిధులియ్యలే.. సీసీఎస్​కు రూ.200 కోట్లు రిలీజ్ చేయని ఆర్టీసీ

హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా నిధులియ్యలే.. సీసీఎస్​కు రూ.200 కోట్లు రిలీజ్ చేయని ఆర్టీసీ

హైదరాబాద్, వెలుగు: సీసీఎస్​కు రూ.200 కోట్లు విడుదల చేయాలని ఆర్టీసీకి హైకోర్టు ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగిసింది. అయితే, ఆర్టీసీ మాత్రం సీసీఎస్​కు నిధులు విడుదల చేయలేదు.దాంతో ఆర్టీసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని  హైకోర్టులో సీసీఎస్ (క్రెడిట్ కో ఆపరేటివ్ సోసైటీ) పిటిషన్ దాఖలు చేసింది. గతంలోనూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా నిధులు విడుదల చేయకపోవటంతో  సీసీఎస్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ సందర్భంగా  ఆర్టీసీ అధికారులపై హైకోర్టు ఫైర్ అయ్యింది. నిధుల విడుదలకు ఆర్టీసీ కి నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఆ గడువు కూడా  శుక్రవారంతో ముగిసింది. తాజాగా వేసిన పిటిషన్ పై జరగనున్న విచారణకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఫైనాన్స్ అడ్వయిజర్ విజయ పుష్ప కుమారి వ్యక్తిగతంగా లేదా అడ్వకేట్ ద్వారా వివరణ ఇవ్వాలని జస్టిస్ మాధవి దేవి ఆదేశించారు. శుక్రవారమే ఈ పిటిషన్ విచారణకు రావాల్సి ఉండగా కేసులు ఎక్కువగా ఉండటంతో  రాలేదని తెలుస్తోంది.

మరో 6 నెలలు టైమ్!

సీసీఎస్​కు నిధులు విడుదల చేయటానికి  మరో 6 నెలలు గడువు కావాలని తమ అడ్వకేట్ల ద్వారా హైకోర్టులో  ఆర్టీసీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.  సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో  ఉందని, బ్యాంక్ ల నుంచి అప్పు రావాల్సి ఉందని పిటిషన్​లో పేర్కొననున్నట్లు తెలుస్తున్నది. బడ్జెట్​లో కేటాయించిన రూ.1,500 కోట్లలో గతేడాది రూ.900 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులు విడుదలైనా లేక బ్యాంకులు అప్పులు ఇచ్చినా సీసీఎస్ కు ఫండ్స్ రిలీజ్ ఆర్టీసీ అధికారులు పిటిషన్ ద్వారా కోర్టుకు తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది.

మొత్తం రూ.1,050 కోట్ల బాకాయిలు

సీసీఎస్​కు అసలు, వడ్డీ కలిపి రూ.1050 కోట్లు ఆర్టీసీ బాకీ ఉంది. సీసీఎస్ పేరిట రెండేండ్లుగా కార్మికుల జీతాల నుంచి ప్రతి నెల రూ.18 కోట్లు ఆర్టీసీ కట్ చేసింది. కానీ ఆ ఫండ్స్ సీసీఎస్ కు జమకాలేదు. దీంతో ఈ బకాయిలు, అసలు, వడ్డీ మొత్తం రూ.1,050 కోట్లకు చేరాయి. ఈ నిధులను ఆర్టీసీ విడుదల చేయకపోవటంతో  సీసీఎస్ లో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చే లోన్ అప్లికేషన్లు 7వేలు పెండింగ్ లో ఉన్నాయి.