వాన పడ్తోందని చెట్టుకిందకు వెళ్తే..

వాన పడ్తోందని చెట్టుకిందకు వెళ్తే..
  • గుర్గావ్‌లో పిడుగుపడి ఒకరి మృతి.. మరొకరికి సీరియస్

న్యూఢిల్లీ: మనం బయట ఉన్నప్పుడు వాన పడితే తడవకుండా ఉండేందుకు చెట్ల కింద తలదాచుకుంటాం. వాన తగ్గాక వెళ్లిపోతాం. కానీ అదే ఒక్కోసారి ప్రాణాలు తీస్తుంది. చెట్ల మీద పిడుగులు పడితే ప్రాణాలు పోతాయి. ఇలాంటి సంఘటనే న్యూఢిల్లీ శివార్లలోని గుర్గావ్ లో జరిగింది. శుక్రవారం సాయంత్రం గుర్గావ్ సెక్టార్ 82 లోని సిగ్నేచర్ విల్లాస్ అపార్ట్ మెంట్  కాంప్లెక్స్ దగ్గర చిన్నపాటి చినుకులు పడుతున్న సమయంలో చెట్టుపై పిడుగు పడింది. ఉదయం నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. కాసేపు ఆగినా.. మళ్లీ అదే పరిస్థితి. దీంతో జనం లైట్ తీసుకున్నారు. పలకరించి వెళ్తున్నట్లుగా కురుస్తున్న వానను లెక్క చేయకుండా తిరుగులాడుతున్నారు. అయితే సాయంత్రం సమయంలో ఉరుములు మెరుపులతో కాస్త పెద్ద వాన మొదలవడంతో రోడ్లపై నడిచి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. గుర్గావ్ సెక్టార్ 82 లోని సిగ్నేచర్ విల్లాస్ అపార్ట్ మెంట్  కాంప్లెక్స్ దగ్గర తోవలో నడిచి వెళ్తున్న నలుగురు వ్యక్తులు వానలో తడవకుండా ఉండేందుకు  చెట్టుకిందకు వెళ్లి నిలబడ్డారు. కాసేపటికే అకస్మాత్తుగా అదే చెట్టుపై పిడుగు పడింది. అంతే క్షణాల్లో వారంతా కుప్పకూలిపోయారు.  ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు  ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతున్నారు.  మిగిలిన ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. బాధితులంతా రెసిడెన్షియల్ సొసైటీలోని ఉద్యానవన పనులు చేసే సిబ్బంది అని గుర్తించారు. ఈ దృశ్యాలు చెట్టుకు ఎదురుగా ఉన్న ఓ ఇంటి ముందు పెట్టిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.  వాన పడుతున్న సమయంలో నలుగురు చెట్టుకిందకు వెళ్లి నిలబడడం.. కాసేపటికే మెరుపులా అదే చెట్టుపై పిడుగు పడడంతో నలుగురు బొమ్మల్లా కుప్పకూలిపోయిన దృశ్యాలు చాలా స్పష్టంగా రికార్డయ్యాయి.