మహిళపై నుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు.. రికార్డయిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు

మహిళపై నుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు.. రికార్డయిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబరు 12 లో జరిగిన ప్రమాదం పై ప్రయాణికులు మండిపడుతున్నారు. తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఓ నిండు ప్రాణం బలైనందుకు సీఎం కేసీఆరే ఇందుకు బాధ్యత వహించాలన్నారు.

మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హోండా యాక్టివా బైక్ పై వెళుతున్న మహిళను, వెనుకు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దాదాపు 100 మీటర్ల వరకూ ఆ బస్సు ఆమెను ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ తలపై నుంచి బస్సు వెళ్లడంతో..ఆమె అక్కడికక్కడే మరణించింది.  కళ్ల ముందే ఈ ప్రమాదం జరగడం చూసిన అక్కడి స్థానికులు, ప్రయాణికులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. బస్సు అద్దాలను ధ్యంసం చేశారు. డ్రైవర్ ను చితకబాదారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని న్యూ నల్లకుంటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి గత 15 రోజులుగా ఈ రూట్ లో బస్సు నడుపుతున్నాడని అన్నారు. తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యంగానే ప్రమాదం జరిగిందని,  ట్రాఫిక్ ఎక్కువగా ఉండే దారిలో మితిమీరిన వేగంతో బస్సు నడపాడని ప్రయాణికులు చెప్పారు. బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయని చెప్పడంపై.. బ్రేకులు ఫెయిలైన బస్సును డిపో నుంచి బయటకి ఎలా తీసుకొచ్చారని ప్రశ్నించారు.  సమ్మె విరమించిన డ్రైవర్లను తిరిగి విధుల్లోకి తీసుకొని ఉంటే ఓ నిండు ప్రాణం బలి అయ్యేది కాదన్నారు.

ప్రభుత్వ మొండి వైఖరి వల్ల ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారని అక్కడున్న వారు అన్నారు. కూలీలను డ్రైవర్లుగా పెడితే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని అన్నారు. దయచేసి ప్రజల ప్రాణాలను ప్రైవేట్ డ్రైవర్ల నుంచి కాపాడాలని సీఎం కేసీఆర్ కు రిక్వెస్ట్ చేశారు.