
- కొత్త వాటిలో సర్వే చేసి వివరాలు ఇవ్వాలని సీడీఎంఏ ఆదేశం
- మున్సిపాలిటీల నుంచి వివరాలు సేకరించిన సీడీఎంఏ
- జీహెచ్ఎంసీతో కలిపి టెండర్లు పిలవనున్న మున్సిపల్ శాఖ
- జిల్లాల్లో ప్రభుత్వ భూముల్లో సోలార్ పార్కుల నిర్మాణం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 9 లక్షల స్ర్టీట్ లైట్లు ఉన్నాయని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ (సీడీఎంఏ) అధికారులు అంచనా వేశారు. గ్రామ పంచాయతీలను విలీనం చేసి ఏర్పాటు చేసిన కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మరోసారి సర్వే చేసి ఇపుడున్న స్ర్టీట్ లైట్స్ ఎన్ని, కొత్తగా ఎన్ని ఏర్పాటు చేయాల్సి ఉందన్న వివరాలను పంపాలని కమిషనర్లను సీడీఎంఏ ఉన్నతాధికారులు ఆదేశించారు.
అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి ఎన్ని స్ట్రీట్ లైట్లు అవసరమున్నాయన్న వివరాలు సీడీఎంఏకి అందాయి. త్వరలో జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశమై కొత్త టెండర్ల గురించి చర్చించనున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల్లో సోలార్ స్ర్టీట్ లైట్లు ఏర్పాటు చేసి, హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు కసరత్తు షురూ చేశారు. జిల్లాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో 50, 100 ఎకరాల్లో సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేయాలని ఇటీవల అధికారులతో నిర్వహించిన రివ్యూలో సీఎం ఆదేశించారని మున్సిపల్ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని స్ట్రీట్ లైట్ల నిర్వహణను హైదరాబాద్ లోని తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పిలవనున్న టెండర్ మార్గదర్శకాల్లో ఈ అంశాన్ని కూడా చేర్చాలని సీఎం సూచించారు. దీంతో వీధిదీపాల నిర్వహణపై థర్డ్ పార్టీ ఏజెన్సీ బాధ్యతలను హైదరాబాద్ ఐఐటీ లాంటి సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించారు.
సీడీఎంఏ పరిధిలోని
రాష్ట్రంలో 16 మున్సిపల్ కార్పొరేషన్లు, 144 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలోని 27 యూఎల్బీలను మినహాయిస్తే 132 యూఎల్బీలు ఉన్నాయి. గతంలో ఉన్న 140 యూఎల్బీల్లో కేంద్ర ప్రభుత్వ అనుబంధ కంపెనీ అయిన ఈఈఎస్ఎల్ (ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్) తో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం గడువు 73 యూఎల్బీల్లో కొద్ది నెలల క్రితం ముగిసింది. మిగతా 67 మున్సిపాలిటీల్లో స్ర్టీట్ లైట్ల గడువు మరో రెండేళ్లు ఉంది. కోర్ అర్బన్ రీజియన్ లోని 27 యూఎల్బీలను మినహాయిస్తే మిగిలిన 46 యూఎల్బీలతో పాటు 20 కొత్త యూఎల్బీలను కలిపి 66 యూఎల్బీలకు టెండర్లు పిలవాల్సి ఉంది.
వీటికి సైతం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే టెండర్లు పిలవడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే మరో 63 యూఎల్బీల్లో ఈఈఎస్ఎల్ గడువు 2027 వరకు ఉంది. వీటిని మినహాయించి టెండర్లకు ఏర్పాట్లు చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను కలిపి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) గా ఏర్పాటు చేశారు. దీని పరిధిలోని స్ట్రీట్ లైట్లను కూడా జీహెచ్ఎంసీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ.. ఆచరణకు నోచుకోలేదు. కానీ వీటి పరిధిలోని 2.50 లక్షల వీధిదీపాలను సైతం జీహెచ్ఎంసీనే నిర్వహించాలని, అందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని అధికారులు చెబుతున్నారు.
ఫుల్ ఫిర్యాదులు
జీహెచ్ఎంసీతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్ర్టీట్ లైట్లపై పబ్లిక్ నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. నిర్వహణ సరిగా లేదని, లైట్లు వెలగడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 9 వేల ఫిర్యాదులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ లో ఈఈఎస్ఎల్ గడువు ఈ ఏడాది ఏప్రిల్ 30తో ముగిసింది. మే 1 నుంచి జీహెచ్ఎంసీనే నిర్వహిస్తుంది. వీటి కోసం ప్రత్యేకంగా అడిషనల్ కమిషన్ ను ప్రభుత్వం నియమించింది.