కాల్పుల విరమణ కొనసాగాలి..సరిహద్దు ప్రాంతాల ప్రజలు శాంతి కోరుకుంటున్నరు : జమ్మూకాశ్మీర్  సీఎం ఒమర్  వెల్లడి

కాల్పుల విరమణ కొనసాగాలి..సరిహద్దు ప్రాంతాల ప్రజలు శాంతి కోరుకుంటున్నరు : జమ్మూకాశ్మీర్  సీఎం ఒమర్  వెల్లడి

శ్రీనగర్: భారత్, పాకిస్తాన్  మధ్య కాల్పుల విరమణ చెక్కు చెదరకూడదని, అది అలాగే కొనసాగాలని కోరుకుంటున్నామని జమ్మూకాశ్మీర్  సీఎం ఒమర్  అబ్దుల్లా అన్నారు. యుద్ధం జరిగితే సరిహద్దు ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొంటాయని, ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి ఉంటుందన్నారు. అందుకే బార్డర్  ఏరియాల్లో ఉండేవారు శాంతి కోరుకుంటున్నారని తెలిపారు. పాక్  షెల్లింగ్ లో కాశ్మీర్ లో ప్రభావితమైన ప్రాంతాలను మంగళవారం ఒమర్  సందర్శించారు. స్థానికులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.

అనంతరం కుప్వారా జిల్లా తంగ్ ధార్ లో మీడియాతో సీఎం మాట్లాడారు. ఎక్కడో నోయిడా, ముంబైలో టీవీ స్టూడియోల్లో కూర్చుని డిబేట్లు నిర్వహించే యాంకర్లకు కాల్పుల విరమణ ఇష్టం ఉండదన్నారు. ‘‘యుద్ధం జరిగితే సరిహద్దుల్లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ విషయం టీవీ యాంకర్లకు తెల్వదు. అందుకే వారికి కాల్పుల విరమణ ఇష్టం ఉండదు” అని ఒమర్  వ్యాఖ్యానించారు. పాక్  షెల్లింగ్ లో జరిగిన డ్యామేజీని పూర్తిగా అంచనా వేసి బాధితులకు పరిహారం ఇస్తామని తెలిపారు. ఆపత్కాలంలో ప్రజలకు వ్యక్తిగత బంకర్లను నిర్మించే విధానాన్ని రూపొందిస్తామన్నారు.