ఇయ్యాల ఢిల్లీలో సీఈసీ భేటీ

ఇయ్యాల ఢిల్లీలో సీఈసీ భేటీ
  • హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్
  • కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ అభ్యర్థులపై చర్చ
  • ఖమ్మం సీటు కోసం తీవ్ర పోటీ.. నేడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో ఆదివారం సాయంత్రం జరగాల్సిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) భేటీ సోమవారానికి వాయిదా పడింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లాల్సిన సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కూడా పోస్ట్ పోన్ అయింది. ఈ మీటింగ్​కు రాష్ట్రం తరఫున రేవంత్​తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కమిటీ సభ్యుడు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు. ఇప్పటికే 13 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన సీఈసీ.. మిగిలిన నాలుగు స్థానాలకు క్యాండిడేట్లను అనౌన్స్ చేయాల్సి ఉంది. ఈ భేటీలో ఖమ్మం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.

కావ్యకు వరంగల్ టికెట్ ఖరారు! 

ఖమ్మం సీటు కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద రెడ్డి, మాజీ ఎంపీ సురేందర్ కొడుకు రఘురామ రెడ్డి ప్రధానంగా పోటీపడ్తున్నారు. రఘురామ రెడ్డి.. పొంగులేటికి స్వయాన వియ్యంకుడు కూడా.. ఇక, వరంగల్ టికెట్ మాజీ మంత్రి కడియం శ్రీహరి కూతురు కావ్యకు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఈ ఇద్దరు ఇప్పటికే కాంగ్రెస్​లో చేరారు.

ఇక హైదరాబాద్ టికెట్​కు పరిశీలనలో ఒక బీసీ నేత, మరో మైనారిటీ నేత పేరు వినిపిస్తున్నది. రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకుని వీరిలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉన్నది. కరీంనగర్ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పేరుతో పాటు తీన్మార్ మల్లన్న పేరు కూడా వినిపిస్తున్నది. తాజాగా ఒక మాజీ మంత్రి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన్ను కాంగ్రెస్​లోకి ఆహ్వానించి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై సీఎం రేవంత్.. సీఈసీకి సిఫార్సు చేసినట్టు సమాచారం.

సోమవారం జరగనున్న సీఈసీ భేటీలో ఈ నాలుగు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయనుండటంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఇక, మంగళవారం నుంచి ప్రచారంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఈ నెల 6న చేవెళ్లలో నిర్వహించనున్న జన జాతర సభతో రాష్ట్రంలో కాంగ్రెస్​కు ఊపు రానున్నదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.