సీఎంగా రేవంత్ రెడ్డిని స్వాగతిస్తూ సంబరాలు

సీఎంగా రేవంత్ రెడ్డిని స్వాగతిస్తూ సంబరాలు

ఓయూ/ముషీరాబాద్, వెలుగు: రేవంత్ రెడ్డిని రాష్ట్ర సీఎంగా ఏఐసీసీ  ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఢిల్లీలో ప్రకటించడంతో ఓయూలో మంగళవారం రాత్రి స్టూడెంట్లు సంబరాలు నిర్వహించుకున్నారు. ఓయూ జేఏసీ చైర్మన్ ఓరుగంటి కృష్ణ ఆధ్వర్యంలో ఆర్ట్స్​ కాలేజీ వద్ద పటాకులు కాల్చి, స్వీట్లు  పంచారు. విద్యార్థి సంఘాల నేతలు తిరుపతి రెడ్డి, భీమ్ రావు నాయక్, యేసు, కొండల్, బాబు, ప్రభాకర్, సురేందర్ నాయక్, సంతోష్  తదితరులు ఉన్నారు. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లిలో తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు జగన్, ప్రపుల్ రాంరెడ్డి, వెంకటస్వామి తదితరులు స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నేతృతంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. మాజీ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్ల యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని తన ఆఫీసులో  మీడియా సమావేశం నిర్వహించి  అధ్యక్షుడు మంచాల వెంకటస్వామి మాట్లాడారు.

రాష్ట్రంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందించే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి ఎదురెళ్లి పోరాడారని తెలిపారు.4 కోట్ల ప్రజల ఆత్మగౌరవం కాపాడడానికి కేసీఆర్ నేతృతంలోని దొరల అహంకార పాలన పోవడానికి రేవంత్ రెడ్డి చేసిన పోరాటం కృషి మరువలేనిదన్నారు. ఆయన పోరాటానికి తమ సంఘం పక్షాన కూడా ఎంతో సహకరించమని వివరించారు. కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పీసీసీ పదవిని చేపట్టిన రేవంత్ రెడ్డి అనతి కాలంలోనే పార్టీకి అత్యధిక స్థానాలు సాధించి అధికారంలోకి రావడానికి చేసిన ఉద్యమాలు స్ఫూర్తిదాయకమన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా ప్రకటించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను సమర్ధవంతంగా అమలు చేసి రాష్ట్ర ప్రజలకు అందించాలని కోరారు.