బెంగళూరు: కర్ణాటకలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఒక కాంట్రాక్టర్ నుంచి రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా శిరహట్టి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే చంద్రు లమాని, ఆయన ఇద్దరు పీఏలు అడ్డంగా దొరికిపోయారు. ఈ ముగ్గురినీ లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులకు శనివారం రెడ్ హ్యాండెండ్గా అరెస్ట్ చేశారు. మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పెండింగ్లో ఉన్న రెండు పనులకు సంబంధించిన ఫైల్స్ ముందుకు కదలాలంటే 11 లక్షలు లంచం ఇవ్వాలని సదరు బీజేపీ ఎమ్మెల్యే కాంట్రాక్టర్ను డిమాండ్ చేశాడు.
#WATCH | Gadag, Karnataka | Karnataka Lokayuktha raided a hospital belonging to BJP MLA Chandru Lamani and caught him receiving Rs 5 lakhs cash along with his two PAs and PS by a class one contractor. Lokayukta police took him into custody at midnight.
— ANI (@ANI) February 22, 2026
(Video Source: Lokayukta) pic.twitter.com/FuHTLtdKXK
గడగ్ తాలూకాలోని చించలి గ్రామానికి చెందిన క్లాస్-1 కాంట్రాక్టర్ విజయ్ పూజార్ ఎమ్మెల్యే లంచం డిమాండ్ చేశాడని లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లోకాయుక్త పోలీసుల వలకు ఇలా బీజేపీ ఎమ్మెల్యే చిక్కాడు. మొత్తం 11 లక్షలు డిమాండ్ చేయగా.. మొదటి విడతలో రూ.5 లక్షలు లంచం ఇవ్వాలని బాధిత కాంట్రాక్టర్కు ఈ బీజేపీ ఎమ్మెల్యే తెగేసి చెప్పాడు. లోకాయుక్త పోలీసుల ప్లాన్ ప్రకారం.. కాంట్రాక్టర్ రూ.5 లక్షలు లంచం ఇస్తుండగా తీసుకున్న ఎమ్మెల్యేను, అతని ఇద్దరు పీఏలను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
►ALSO READ | భారత్లో భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేసిన పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదుల అరెస్ట్
శనివారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో లక్ష్మేశ్వర్ పట్టణంలోని లామానీ బాలాజీ ఆసుపత్రిలో బీజేపీ ఎమ్మెల్యే చంద్రు లమాని, ఆయన వ్యక్తిగత సహాయకులు మంజునాథ్ వాల్మీకి, గురు నాయక్ రూ.5 లక్షల లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు పట్టుకున్నారు. లోకాయుక్తకి దొరికిపోయిన సమయంలో.. ఎమ్మెల్యే పీఏ అయిన నాయక్ రూ.50 వేల డబ్బులున్న కవర్ను ఆసుపత్రి వెనుక ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాల ఆవరణలోకి విసిరేశాడు. లోకాయుక్త పోలీసులు ఆసుపత్రిలో దొరికిన రూ.4.50 లక్షలతో పాటు ఆ 50 వేల డబ్బును కూడా సీజ్ చేశారు.
లోకాయుక్త ఎస్పీ సిద్ధలింగప్ప ఆధ్వర్యంలో గడగ్ లోకాయుక్త డీవైఎస్పీ విజయ్ బిరాదార్, ఇన్‌స్పెక్టర్ పరమేశ్ కవటగి, ఇతర సిబ్బంది ఈ దాడులు నిర్వహించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన లోకాయుక్త అధికారులు వైద్య పరీక్షల తర్వాత ఎమ్మెల్యేను బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. లోకాయుక్త తనిఖీలు చేసిన సమయంలో ఆసుపత్రి ముందు బీజేపీ కార్యకర్తలు గుమిగూడి, కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోకాయుక్త ఆకస్మిక దాడులు కాంగ్రెస్ కుట్ర అని ఆరోపించారు.
