ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల చదువు మానేశాడు. కుటుంబానికి సాయంగా ఉండేందుకు ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు. డబ్బు కోసం ఓవర్ టైం డ్యూటీలు కూడా చేసేవాడు. కానీ.. సోషల్ మీడియా అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఫ్రెండ్ ఫోన్‌తో తీసిన ఒకే ఒక వీడియోతో రోహిత్ ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు అతనికి యూట్యూబ్‌లో 3.89 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబర్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో 28.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సొంతంగా ఫ్యాషన్ బ్రాండ్ ఏర్పాటు చేసి వ్యాపారంలోనూ రాణిస్తున్నాడు.
మొదటి వీడియోతోనే ఇన్‌ఫ్లుయెన్సర్!
మిలియన్ల వ్యూస్
రోహిత్ ఎమోషనల్ యాక్టింగ్, హ్యూమర్, స్ట్రీట్ స్టయిల్ ఫ్యాషన్, జిమ్ లైఫ్‌స్టయిల్‌పై చేసిన వీడియోలకు రీచ్ ఎక్కువగా వస్తోంది. అతను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ‘‘గణపతి ఆగమన్” లాంటి వీడియోలకు యూత్ నుంచి ఆదరణ బాగా వచ్చింది. ఈ మధ్యే జీరో9 పేరుతో సొంతంగా ఆన్‌లైన్ ఫ్యాషన్ స్టోర్‌ని లాంచ్ చేశాడు. ఫిట్‌నెస్ మోడల్‌గా కూడా పని చేస్తున్నాడు. కోలాబరేషన్స్, మ్యూజిక్, ఫ్యాషన్ వెంచర్స్, యూట్యూబ్ యాడ్స్, బ్రాండ్ ప్రమోషన్స్‌తో నెలకు రూ.10 నుంచి 20 లక్షలు సంపాదిస్తున్నాడు. 2023లో క్రియేటర్స్ యునైటెడ్ అవార్డ్స్‌లో ‘‘బ్లాక్ బస్టర్ ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేటర్ ఆఫ్ ది ఇయర్” టైటిల్ గెలుచుకున్నాడు. రోహిత్ చేసిన ‘ఇష్కా’, ‘జిహాలే మిస్కిన్’ మ్యూజిక్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
►ALSO READ | వారఫలాలు ( ఫిబ్రవరి 22–28): ఈ వారంలో పంచగ్రహకూటమి ప్రభావం .. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది..
రోహిత్ జిన్జుర్కే 2000 ఏప్రిల్ 9న గుజరాత్‌లోని సూరత్‌లో ఒక మిడిల్-క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు. పేదరికం వల్ల 17 ఏండ్ల వయసులోనే చదువు మానేసి చీరల ఫ్యాక్టరీలో మెషిన్ సూపర్‌వైజర్‌గా పనిలో చేరాడు. నెలకు రూ.7,000 సంపాదించేవాడు. అవి సరిపోక ఒక్కోసారి రెండు షిఫ్ట్‌లు అంటే 24 గంటలు పనిచేసేవాడు. 2021లో తండ్రి చనిపోయాడు. కానీ, వాళ్ల అమ్మ రోహిణి జిన్జుర్కే అతని వెన్నంటే ఉండి ముందుకు నడిపించింది. ఆమె సపోర్ట్‌తోనే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదిగాడు. ఆ తర్వాత ఫ్యామిలీతో ముంబైలో సెటిల్ అయ్యాడు. అతని గర్ల్‌ఫ్రెండ్ నీతా షిలిమ్కర్ కూడా ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సర్.
టిక్‌టాక్‌తో..
రోహిత్ సోషల్ మీడియా కెరీర్ 2019లో టిక్‌టాక్‌తో మొదలైంది. ‘‘అప్పట్లో అందరూ టిక్‌టాక్‌లో షార్ట్ వీడియోలు చేసేవాళ్లు. నేను రెగ్యులర్‌గా ఆ వీడియోలు చూసేవాడిని. ఒకరోజు నాకు కూడా వీడియోలు చేయాలి అనిపించింది. కానీ.. నా ఫోన్ కెమెరాతో క్వాలిటీ వీడియోలు తీయడం కష్టం. అందుకే నా ఫ్రెండ్ ఐఫోన్‌లో ఒక స్లో-మోషన్ వీడియో షూట్ చేశా. దానికి అట్రాక్టివ్‌గా ఉండే పాట యాడ్ చేసి టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేశా. ఆ వీడియో వైరల్ అయ్యింది. వందకు పైగా లైక్స్, దాదాపు 80 వేల వ్యూస్ వచ్చాయి. ఆ వీడియో ఇచ్చిన బూస్ట్‌తో అప్పటినుంచి రెగ్యులర్‌గా లిప్ సింక్, డాన్స్ వీడియోలు పోస్ట్ చేశాను. కొంత డబ్బు సంపాదించాక ఐఫోన్ కొనుక్కున్నా. తర్వాత ఉద్యోగం వదిలేశా” అంటూ తన జర్నీని చెప్పుకొచ్చాడు రోహిత్.
ఇన్‌స్టాగ్రామ్‌కు షిఫ్ట్
2020లో టిక్‌టాక్ బ్యాన్ తర్వాత రోహిత్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌కు షిఫ్ట్ అయ్యాడు. అతని యూట్యూబ్ చానెల్ ‘‘రోహిత్ జిన్జుర్కే’’లో వ్లాగ్స్, లైఫ్‌స్టయిల్, డాన్స్, రియాక్షన్స్, మోటివేషనల్ కంటెంట్ అప్‌లోడ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు 161 వీడియోలు అప్‌లోడ్ చేశాడు. చానెల్‌కు 3.89 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు.
ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అతని పేజీని ఏకంగా 28.8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. “చాలామంది క్రియేటర్స్ సోషల్ మీడియా ట్రెండ్స్‌ని ఫాలో అవుతుంటారు. నేను అలాంటివాటిని ఎప్పుడూ పెద్దగా ఫాలో కాలేదు. నా సొంత కంటెంట్‌ను
క్రియేట్ చేయడానికే ఇష్టపడతా”అన్నాడు రోహిత్.
