నల్గొండ జిల్లాలో వలస కూలీలకు విముక్తి

నల్గొండ జిల్లాలో వలస కూలీలకు విముక్తి

దేవరకొండ, వెలుగు: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామ పరిధిలోని ఎం.ఆర్ ఇటుక బట్టీల్లో శ్రమ దోపిడీకి గురవుతున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన 109 మంది వలస కూలీలను అధికారులు వారి స్వస్థలాలకు పంపించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..  నల్గొండ జిల్లా జడ్జి ఆదేశాల మేరకు దేవరకొండ న్యాయసేవాధికారి కె. అనిత ఆధ్వర్యంలో శనివారం చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామ పరిధిలోని ఎం.ఆర్ ఇటుక బట్టీల్లో తనిఖీలు నిర్వహించి అధిక శ్రమతో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను విముక్తి కల్పించారు. దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు.

ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చి ఇక్కడ కనీస సౌకర్యాలు లేకుండా కష్టాలు అనుభవిస్తున్న 23 కుటుంబాలకు చెందిన 109 మంది కూలీలను గుర్తించి రక్షించారు. అనంతరం వారికి తగిన సహాయం అందించి, ప్రత్యేక వాహనాల ద్వారా వారి స్వస్థలాలకు పంపించారు. ఈ కార్యక్రమంలో అదనపు సివిల్ జడ్జి స్నేహ, న్యాయవాది ఉమాశంకర్, ఎమ్మార్వో మధుసూదన్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.