నలభై దాటగానే చాలామందిని రకరకాల సమస్యలు వేధిస్తుంటాయి. వాటిలో ముఖ్యంగా ఎఫెక్ట్ చూపించేది కండరాల బలహీనత. ‘చిన్న సమస్యే!’ అని నిర్లక్ష్యం చేసే సమస్యల్లో ఇది కూడా ఒకటి. పైగా దీనివల్ల ఏ చిన్న పనీ చేయలేకపోతారు. మెట్లు ఎక్కలేరు, బరువులు ఎత్తలేరు, అంతెందుకు ఫాస్ట్‌గా నడవలేరు! ఈ సమస్యలకు వేరే వేరే కారణాలు చెప్పి మూల కారణం వెతకడం మానేస్తుంటారు కొందరు. దాంతో ఇంకా ఇబ్బందుల్లో పడతారు.
పైగా ఈ రోజుల్లో ఈ సమస్య ముందే వచ్చేస్తోంది. కనిపెట్టకపోతే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే శరీర ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా దాని మూల కారణం తెలుసుకుంటే సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఆరోగ్యంగానే కాదు.. ఉత్తేజకరంగా జీవితం సాగుతుంది.
‘‘భారతీయులు, ముఖ్యంగా దక్షిణ భారతీయులు జన్యుపరంగా తక్కువ మజిల్ మాస్ కలిగి ఉంటారు. దానికి తోడు సౌకర్యవంతమైన జీవనశైలి, డెస్క్ ఉద్యోగాలు, స్క్రీన్‌ల ముందు ఎక్కువ సమయం గడపడం, చాలా తక్కువ శారీరక ఒత్తిడి.. ఇవన్నీ కలిసి మజిల్ మాస్ విపరీతంగా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజుల్లో మనం మన శరీరాన్ని ఎలా ఉపయోగిస్తున్నామో ఒకసారి ఆలోచించండి. డోర్ ఓపెన్ చేయగానే కిరాణా సామాను, కూరగాయలు, పండ్లు, పాలు ఇలా ఒక్కటేంటి.. ప్రతీది చేతిలో పెట్టేస్తున్నారు.
ఫోన్లో ఆర్డర్ చేయడం ఆలస్యం కోరిన వస్తువులు క్షణాల్లో ఇంటి ముందుకొచ్చేస్తున్నాయి. ముఖ్యంగా చేతులకు పని తగ్గిపోయింది. ఎక్కడికి వెళ్లాలన్నా వెహికల్స్ అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి కాళ్లకు నడిచే పని లేకుండా పోయింది. అందుకే నలభై ఏళ్లకే సార్కోపీనియా సమస్య తలెత్తుతోంది” అని ఆర్థోపెడీషయన్లు చెప్తున్నారు.
సార్కోపీనియా అంటే..
సార్కోపీనియా అనేది వయసు పెరిగేకొద్దీ కండరాల ద్రవ్యరాశి, బలం క్రమంగా తగ్గిపోయే ఒక సాధారణ సమస్య. గ్రీకు పదాలైన sarx – మాంసం, penia – కొరత నుంచి ఈ పేరు వచ్చింది.. అంటే ‘మాంసపు కొరత’ అని అర్థం. దీన్ని ‘ఏజ్ రిలేటెడ్ మజిల్ లాస్’ అని కూడా పిలుస్తారు. సాధారణంగా 30- –40 ఏళ్ల నుంచే కండరాలు కొద్దిగా తగ్గడం మొదలవుతుంది. ప్రతి దశాబ్దానికి 3-8 శాతం కండర ద్రవ్యరాశి (మజిల్ మాస్) కోల్పోతాం. కానీ 50 నుంచి -60 ఏళ్ల తర్వాత ఇది వేగంగా జరుగుతుంది.
65 ఏళ్లు దాటిన వారిలో10- నుంచి 20 శాతం మందికి గణనీయమైన సార్కోపీనియా ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంచనా. కాలక్రమేణా ఈ కండరాలు ఉపయోగించకపోవడం వల్ల దీన్ని డిస్యూస్ అట్రోపీ అని పిలుస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ ఈ క్షీణత మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఇది శక్తి, వేగవంతమైన కదలికలకు బాధ్యత వహించే ఫాస్ట్-ట్విచ్ ఫైబర్స్ పైన ప్రభావితం చేస్తుంది. వయస్సు వల్ల వచ్చే సార్కోపీనియా సహజమే అయినా లైఫ్ స్టైల్ మార్పులతో చాలావరకు కంట్రోల్ చేయొచ్చు. బలహీనత ఎక్కువ ఉంటే దానికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు.
ఇలా ఉంటే..
కండరాల బలహీనత, నెమ్మదిగా నడవడం, మెట్లు ఎక్కలేకపోవడం, బరువులు ఎత్తడం కష్టమవడం, చేతులు, కాళ్లు, తొడ భాగాల్లో కండరాలు త్వరగా అలసిపోవడం, స్టామినా తగ్గడం, తరచూ పడిపోవడం, ఎముకలు విరిగే ప్రమాదం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిలో ఏ లక్షణమున్నా రోజువారీ పనులు చేసుకోలేకపోతారు. తరచూ హాస్పిటల్‌కి వెళ్లాల్సి వస్తుంటుంది. సమస్య ఎక్కువైతే దీర్ఘకాల సంరక్షణ అవసరం అవుతుంది.
►ALSO READ | ఒకే ఒక్క వీడియో.. పేదరికాన్ని పాతరేసింది.. ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్పైరింగ్ స్టోరీ !
చేతి పట్టు ఎంత బలంగా ఉంది? నడక వేగం ఎలా ఉంది? వంటివాటితోపాటు మజిల్ మాస్ మెజర్మెంట్ స్కాన్ చేసి ఈ లక్షణాలను తెలుసుకుంటారు. ఇవి తక్కువగా ఉంటే సార్కోపీనియా అని నిర్ధారిస్తారు. సార్కోపీనియాకు పూర్తి నివారణ లేదు. కానీ కొన్నాళ్లు దాని ప్రభావం పడకుండా చేయొచ్చు. అలాగే కొంతవరకు మజిల్ మాస్ తిరిగి పొందొచ్చు.
కారణాలు
సార్కోపీనియానికి ప్రధాన కారణం వృద్ధాప్యం. అయినా, ఇతర అంశాలు కూడా దీన్ని త్వరగా తీసుకొస్తాయంటున్నారు ఎక్స్పర్ట్స్. అవేంటంటే.. వ్యాయామం చేయకపోవడం, పోషకాహార లోపం, హార్మోన్లలో మార్పులు, దీర్ఘకాలిక వ్యాధులు, ఊబకాయం లేదా అధిక ఒత్తిడి. ప్రొటీన్ తక్కువ తీసుకోవడం వల్ల మజిల్ పెరగదు. అలాగే కండరాలను ఉపయోగించకపోతే అవి క్షీణిస్తాయి. టెస్టోస్టెరాన్, గ్రోత్ హార్మోన్లపై ప్రభావం పడుతుంది. డయాబెటిస్, కిడ్నీ సమస్యలు మొదలైనవాటి వల్ల కూడా మజిల్ మాస్ తగ్గుతుంది.
మజిల్ కావాలంటే..
సమతుల ఆహారం తీసుకోవాలి. అందులో భాగంగా గుడ్లు, చికెన్, చేపలు, పాల ఉత్పత్తులు, నట్స్ వంటి ప్రొటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తినాలి. విటమిన్- డి, ఇతర పోషకాలు అందేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా నడవాలి. యోగా చేయాలి. వెయిట్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
వారానికి 2 లేదా 3 రోజులు డంబెల్స్, రెసిస్టెన్స్ బ్యాండ్స్ లేదా బాడీ వెయిట్ ఎక్సర్సైజ్లు చేయొచ్చు. అరవై దాటాక ప్రొటీన్ ఫుడ్‌తో పాటు రాత్రి పూట వేళకు తిని, నిద్రపోవాలి. కొన్ని సందర్భాల్లో హార్మోన్ థెరపీ లేదా మందులు వాడాల్సిన అవసరం వస్తుంది. ఇవన్నీ కచ్చితంగా డాక్టర్ సలహా మేరకు మాత్రమే పాటించాలి. కాబట్టి ముందుగా ఏ లక్షణం కనిపించినా డాక్టర్ని సంప్రదించాలి.
