హైదరాబాద్లో బీజేపీ సంబరాలు

హైదరాబాద్లో బీజేపీ సంబరాలు
  • పటాకులు కాలుస్తూ , స్వీట్లు పంచిన నాయకులు, కార్యకర్తలు

హైదరాబాద్, వెలుగు: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు రాష్ట్ర పార్టీ నాయకత్వంలో జోష్‌ నింపింది. దీంతో పార్టీ స్టేట్‌ ఆఫీసులో నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాలుస్తూ, స్వీట్లు పంచారు. మోడీ నాయకత్వం వర్ధిల్లాలి.. అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు ప్రేమేందర్ రెడ్డి, బాబు మోహన్, ప్రకాశ్ రెడ్డి, చంద్రవదన్, జయశ్రీ, సుధాకర్ శర్మతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గుజరాత్‌లో తిరుగులేని మెజారిటీతో గెలిచామని, ఇది తెలంగాణ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చింతల రామచంద్రారెడ్డి అన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప తేడాతో అధికారానికి దూరం అయ్యామన్నారు. గుజరాత్‌లో బీజేపీ గెలుపును జీర్ణించుకోలేక వైసీపీ మళ్లీ ఉమ్మడి రాష్ట్రం కావాలనే డిమాండ్‌ను తెరపైకి తెస్తోందని ఆరోపించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని టీఆర్ఎస్, వైసీపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత మళ్లీ ఏపీ, తెలంగాణ ఎలా కలుస్తాయని ప్రశ్నించారు.

రాష్ట్రంలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంటే, రాహుల్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్‌కు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందన్నారు. వేములవాడ, భద్రాచలం, కొమురెల్లి ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. వేములవాడ అభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయిస్తానన్న కేసీఆర్.. మాట నిలబెట్టుకోవాలన్నారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని బీజేపీ నేత, రిటైర్డ్ ఐఏఎస్ చంద్రవదన్ ఆరోపించారు. చట్టం, రూల్ ఆఫ్ లా ప్రకారం రాష్ట్రంలో వారు పని చేయలేకపోతున్నారని చెప్పారు. కాగా, పార్టీ స్టేట్‌ ఆఫీసులో నిర్వహించిన సంబురాల్లో అపశృతి చోటుచేసుకుంది. పార్టీ కార్యకర్తలు ఆఫీసు ముందు పటాకులు కాలుస్తున్న సమయంలో నిప్పు రవ్వలు ఎగిరి ఎదురుగా ఉన్న పార్టీ ఫ్లెక్సీపై పడటంతో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనున్న కేబుల్ వైర్లు కాలిపోయాయి. వెంటనే ఫైరింజన్ రావడంతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

తెలంగాణలోనూ గుజరాత్ ఫలితాలే..: డీకే అరుణ

గుజరాత్‌లో వచ్చిన ఫలితాలే తెలంగాణలోనూ రిపీట్ కాబోతున్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఏడోసారి గుజరాత్‌లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టడం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వ తీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీని గెలిపించిన గుజరాత్‌ ప్రజలకు ఈ సందర్భంగా ఆరుణ కృతజ్ఞతలు చెప్పారు