
సినీనటుడు, టీడీపీ నాయకుడు నందమూరి తారకరత్న మరణం పై సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తారకరత్న మరణం బాధాకరమని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
నందమూరి తారకరత్న మరణం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. తారకరత్న ఆత్మకు శాంతి కలిగించాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నానన్నారు. తారకరత్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తారకరత్న మంచి నటుడని బండి సంజయ్ కొనియాడారు.
తారకరత్న మృతి నందమూరి కుటుంబానికి, టీడీపీకి తీరనిలోటని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. తారకరత్న మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఉజ్వల రాజకీయ భవిష్యత్తు ఉన్న ఆయన చిన్న వయసులోనే మరణించడం బాధాకరమన్నారు. కుటుంబంలో ఆప్తుడిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న.. తారకరత్న కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ తన ప్రగాఢ సానుభూతిని కాసాని జ్ఞానేశ్వర్ తెలియజేశారు.
తారకరత్న మరణవార్త విని షాక్ కు గురయ్యానని సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు. తారకరత్న అన్న చాలా చిన్నవయసులో మనందరిని విడిచివెళ్లడం బాధాకరమన్నారు. తన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. తారకరత్న కుటుంబసభ్యులకు ఆ దేవుడు మనోధైర్యం కల్పించాలని మహేష్ బాబు ట్వీట్ చేశారు.