
బాసర ట్రిపుల్ ఐటీలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఉన్నట్టుండి సెలవులు ప్రకటించడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంక్షలు విధించడం చర్చనీయాంశమైంది. ఇక నుంచి విద్యార్థులు సెల్ ఫోన్లు తీసుకురావడం నిషేధమని ఇంచార్జి వెంకటరమణ ఉత్తర్వులు జారీ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, క్లాస్ రూంలు, ల్యాబ్, అకాడమిక్ బ్లాకులలో సెల్ ఫోన్ వాడకం నిషేధం అంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫోన్లు వినియోగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు..
గత కొద్ది రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలో పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ సమస్యలు పరిష్కరించాలని, రెగ్యులర్ వీసీని నియమించాలనే డిమాండ్లతో గత వారం రోజులుగా విద్యార్థులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఎండ, వానను లెక్క చేయకుండా క్యాంపస్ లో కూర్చొని నిరసన చేపట్టారు. గతంలో సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చి అమలు చేయలేదని, ఈసారి మాత్రం తమ సమస్యలు పరిష్కరించాలని మొక్కవోని ధైర్యంతో ఆందోళనలు కొనసాగించారు. చివరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆఫీసర్ల సమక్షంలో స్టూడెంట్స్తో చర్చలు జరిపారు. స్టూడెంట్స్ తమ 12 డిమాండ్లను మంత్రి ముందు పెట్టారు. నెల రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని, స్టూడెంట్ల డిమాండ్ మేరకు అతి త్వరలో రెగ్యులర్ వీసీని నియమిస్తామని హామీ ఇచ్చారు. కానీ..అనూహ్యంగా కలుషిత ఆహారం తిని చాలా మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.
సెమిస్టర్ బ్రేక్ సెలవులు ..
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ సంఘటనతో వీసీ హోదాలో ఇంచార్జి వీసీగా ప్రొఫెసర్ వెంకటరమణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. ఈనెల 24వ తేదీలోగా ప్రధాన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. విద్యార్థులతో చర్చలు జరిగినా.. అవి సఫలం కాలేదు. అధికారులకు ఇచ్చిన డెడ్ లైన్ శనివారం అర్ధరాత్రితో ముగిసిపోయింది. అనూహ్యంగా E3 విద్యార్థులకు సెమిస్టర్ బ్రేక్ సెలవులు ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. విద్యార్థులు ఈసారి న్యాయపోరాటానికి సిద్ధమౌతున్నట్లు సమాచారం. కాలేజీకి సెలవులు ఉండడంతో ఆందోళనలకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.