సెల్ టవర్ల సామగ్రి చోరీ ముఠా అరెస్ట్

సెల్ టవర్ల సామగ్రి చోరీ ముఠా అరెస్ట్
  • తొమ్మిది మందిని రిమాండ్ కు తరలించిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్
  • నిందితుల వద్ద రూ. 60 లక్షల విలువైన పరికరాలు స్వాధీనం 

బషీర్ బాగ్, వెలుగు: సిటీలో ఎయిర్ టెల్, జియో సంస్థల సెల్‌‌‌‌‌‌‌‌ టవర్లకు చెందిన సామగ్రి చోరీ చేసి అమ్ముతున్న  ముఠాను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, కాచిగూడ, ఆదిబట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం బషీర్ బాగ్ లోని సీసీఎస్ లో మీడియా సమావేశంలో టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరుమాళ్ వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లాకు చెందిన బి.నాగరాజు, ఎం.నగేశ్​ ఉపాధి కోసం సిటీకి వచ్చారు. ఎల్ బీనగర్ లో ఉంటూ.. ఎయిర్ టెల్ నెట్ వర్క్ సంస్థ సబ్ కాంట్రాక్టర్( సుమ్మిట్ ఎంటర్ ప్రైజెస్ ) జె. వెంకటరమణ వద్ద టవర్ రిగ్గర్స్ గా చేరారు. వచ్చే జీతం సరిపోక, ఎంజాయ్ చేసేందుకు సెల్ టవర్ల సామగ్రి, కేబుల్ వైర్ల చోరీకి ప్లాన్ చేశారు.

ముందుగా టవర్లకు వాటిని అమర్చి.. రెండు, మూడు రోజుల తర్వాత ఎత్తుకెళ్లేవారు. వాటిని ఢిల్లీకి చెందిన దిల్షాద్ మాలిక్, చాంద్ మాలిక్,  షహరియన్ మాలిక్, సొహైల్ మాలిక్ లకు అమ్మేవారు. వీటిని దేశంలో ఎక్కడైనా వాడితే కంపెనీకి తెలుస్తుందని విదేశాలకు తరలించేవారు.  టవర్ల సామగ్రి తరుచూ చోరీపై  ఎయిర్ టెల్ సంస్థ పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా నిందితులను అరెస్ట్ చేశారు.

ఇదే తరహాలో నల్లగొండ జిల్లాకు చెందిన నీరుడు చైతన్య, ఎల్ రవినాయక్  జియో నెట్ వర్క్ లో టవర్ రిగ్గర్స్ గా పని చేస్తున్నప్పుడు రిమోట్ రేడియో హెడ్స్ ను చోరీ చేసి అమ్మేవారు. ఇలా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడ్డారు. జియో సంస్థ ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద 60 లక్షలు విలువైన ఎయిర్ టెల్4జీ ఆర్ఆర్ యూలు 13 , ఎయిర్ టెల్5జీ ఆర్ఆర్ యూలు 01 , జియో 4జీ ఆర్ఆర్ హెచ్ లు 08 , 600 మీటర్ల కేబుల్ వైర్లు , 10 మొబైల్ ఫోన్లు సీజ్ చేసి, నిందితులను రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.

బాడీ బిల్డ్ అయ్యే ఇంజెక్షన్లు అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్ 

లైసెన్స్ లేకుండా ఇంజెక్షన్లు అమ్ముతున్న జిమ్ ఓనర్, ఇద్దరు ట్రైనర్లను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ ఎస్.రష్మీ పెరుమాళ్ తెలిపిన ప్రకారం.. ఆసిఫ్ నగర్ లో నితీశ్​ సింగ్ పల్స్ ఫిట్ నెస్ జిమ్ నిర్వహిస్తున్నాడు. జిమ్ కు వచ్చే వారికి వేగంగా బాడీ బిల్డ్ అయ్యేందుకు మెఫెంటెర్‌‌‌‌‌‌‌‌మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను వాడాలని జిమ్ ట్రైనర్లు సయ్యద్ జాఫర్ అలీ, రాహుల్ సింగ్ సూచించారు. వాటిని నితీశ్​సింగ్ ఇండియా మార్ట్ యాప్ ద్వారా ముంబై కు చెందిన కునల్ అనే వ్యక్తి నుంచి కొరియర్ ద్వారా తెప్పించేవాడు.  వీటిని జిమ్ ట్రైనర్లకు ఇచ్చి, అధిక ధరలకు కస్టమర్లకు అమ్ముతున్నారు. సమాచారం అందడంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు జిమ్ పై రైడ్ చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు