
న్యూఢిల్లీ: రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీల నిధుల గురించి తెలుసుకునే హక్కు పౌరులకు లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఎలాంటి చట్టాలనుగానీ, హక్కులనుగానీ ఉల్లంఘించదని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ఇదే విషయాన్ని చెబుతోందని తెలియజేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేర చరిత్రను ప్రజలంతా తెలుసుకోవచ్చన్న సుప్రీం కోర్టు తీర్పును పార్టీలు పొందే విరాళాలకు ఆపాదించలేమన్నారు.
ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థి ఆస్తులను మాత్రమే తెలుసుకునే వెసులుబాటు రాజ్యాంగం కల్పించిందని ఏజీ గుర్తుచేశారు. పొలిటికల్ పార్టీల నిధుల కోసం ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు సుప్రీం కోర్టు సోమవారం అంగీకరించింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం నుంచి విచారణ ప్రారంభించనుంది.
ఎన్నికల రూల్స్ ప్రకారం ఏ పార్టీకైనా ఎవరైనా ఇచ్చిన విరాళం రూ.2 వేలు, ఆపైన ఉంటే ఆ రాజకీయ పార్టీ దాత వివరాలు చెప్పాల్సి ఉంటుంది. అయితే, ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ కింద రూ.కోటి విరాళం ఇచ్చినా దాత పేరు వెల్లడించాల్సిన అవసరం లేకుండా రూల్స్ తెచ్చారు. దీనిని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి.