కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం మార్గదర్శకాలు

కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం మార్గదర్శకాలు

కరోనా వైరస్ వ్యాప్తి నుంచి విముక్తి కల్పించే వ్యాక్సిన్  త్వరలోనే భారత్ లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.ఈ క్రమంలో టీకా పంపిణీపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. మొదటి ప్రాధాన్యం కింద కరోనా ముప్పు అధికంగా ఉండే వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతో పాటు వృద్ధులకు టీకా ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ పై మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక వ్యాక్సిన్ కేంద్రంలో రోజుకు 100 నుంచి 200 మందికి టీకా ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం.. వ్యాక్సిన్ తీసుకున్నవారిని కనీసం 30 నిమిషాల పాటు పరిశీలనలో ఉంచాలని సూచించింది.

వ్యాక్సిన్ కావాలనుకునేవారు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని.. అలాంటివారినే టీకా కేంద్రాల్లో అనుమతించాలని కేంద్రం తన ఆదేశాల్లో జారీ చేసింది. స్పాట్ రిజిస్ట్రేషన్ వంటివాటికి అవకాశం లేదని తెలిపింది. సాధ్యమైనంత వరకు ఒక జిల్లాకు ఒకే కంపెనీకి చెందిన టీకాను కేటాయిస్తే మంచిదని సూచించింది. ఒకే ప్రాంతంలో ఎక్కువ రకం వ్యాక్సిన్లతో గందరగోళం తలెత్తే ప్రమాదముందని హెచ్చరించింది. వ్యాక్సిన్ క్యారియర్, వ్యాక్సిన్ వయల్స్, ఐస్ ప్యాక్ లకు సూర్యరశ్మి తగలకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపింది.

అంతేకాదు ..వ్యాక్సిన్ తీసుకునే వ్యక్తి కేంద్రానికి వచ్చేంతవరకు వ్యాక్సిన్, డైల్యుయెంట్లను వ్యాక్సిన్ క్యారియర్లో జాగ్రత్తగా మూసి ఉంచి పరిరక్షించాలని కేంద్రం తెలిపింది. టీకా సెషన్ పూర్తయిన తర్వాత ఐస్ ప్యాక్స్, ఓపెన్ చేయని వ్యాక్సిన్ వయల్స్ ఉన్న వ్యాక్సిన్ క్యారియర్ ను తిరిగి కోల్డ్ స్టోరేజీ పాయింట్ కు పంపించాల్సి ఉంటుంది. ఒక్కో వ్యాక్సినేషన్ బృందంలో ఐదుగురు సభ్యులు ఉంటారు. ఒక టీకా కేంద్రంలో రోజుకు 100 మందికి టీకా ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలి. ఒకవేళ వ్యాక్సిన్ కేంద్రం పెద్దగా ఉండి.. వెయిటింగ్ రూమ్, పరిశీలన గదిలో సరిపడా స్థలం ఉంటే మరో వ్యాక్సినేటర్ ఆధికారిని ఏర్పాటు చేసి 200 మందికి టీకా ఇవ్వొచ్చు. మొదటి ప్రాధాన్యంలో ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, 50 ఏళ్ల పైబడిన వారికి టీకా ఇవ్వాలి. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితిని బట్టి 50 ఏళ్ల లోపువారికి అందించాలంది. వ్యాక్సిన్ వేసినప్పుడు… కొందరికి దురద లాంటి సమస్యలు రావచ్చు. అలా వస్తే ఎలా స్పందించాలి, ఏయే మందులను అందుబాటులో ఉంచుకోవాలన్న దానిపైనా ఆరోగ్య సిబ్బందికి కేంద్రం అవగాహన కల్పిస్తోంది.

వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం CO-WIN వెబ్ సైట్ ను తీసుకురానుంది. ఎన్నికలలో గుర్తింపుకార్డు చూపించిన వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇస్తున్నట్లే.. టీకా పంపిణీలోనూ వ్యవహరించనుంది. ఇందులో ఆధార్‌కార్డ్, ఓటర్ ఐడీ, డైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్ ఇలా ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో టీకా కోసం ముందస్తు రిజిస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి దశ పంపిణీలో భాగంగా దాదాపు 30కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ప్రణాళిక రూపొందిస్తోంది. మొత్తంగా కరోనా వ్యాధి నిరోధక టీకా పంపిణీకి కేంద్ర ఏర్పాట్లను స్పీడప్ చేస్తోంది.