
- మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు.. మద్దతు ధరను మించనున్న రేటు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 50 వేల టన్నుల కందుల సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత సీజన్లో దేశ వ్యాప్తంగా 10 లక్షల టన్నుల కందులను సేకరించాలని నాఫెడ్ టార్గెట్‌గా పెట్టుకుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో 50 వేల టన్నులను మార్కెట్‌లు, ప్యాక్స్, సహకార సంఘాల ద్వారా సేకరించడానికి మార్కెఫెడ్‌ను నోడల్ ఏజెన్సీ గా నియమించింది. తొలిసారి మద్దతు ధరకు మించి రోజువారీ మార్కెట్ రేటుకు కందులను సేకరించనున్నారు.
కేంద్రం ధరల స్థిరీకరణ ఫండ్ ద్వారా ఈ కొనుగోళ్లు చేపట్టనుంది. రాష్ట్రంలో వానాకాలం సీజన్లో 4,74,299 ఎకరాల్లో కందులు సాగు చేయగా 2.37 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని మార్కెటింగ్‌శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం మద్దతు ధర క్వింటాల్ రూ.ఏడు వేలు ఉంది. కానీ ఓపెన్ మార్కెట్లో క్వింటాల్ రూ.9.500 నుంచి రూ.10,500 మధ్య పలుకుతోంది.ఈ నేపథ్యంలో వ్యాపారులతో పోటీ పడి కందులు కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే కందుల కొనుగోళ్ల బాధ్యతలను మార్క్‌ఫెడ్ కు అప్పగించింది. రాష్ట్రంలో కందుల కొనుగోళ్లను గురువారం నుంచి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రంలో కంది రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు.