లోక్ సభలో వక్ఫ్ సవరణ బిల్లు గొడవ.. ప్రతిపక్షాల ఒత్తిడికి త‌లొగ్గిన కేంద్రం

లోక్ సభలో వక్ఫ్ సవరణ బిల్లు గొడవ.. ప్రతిపక్షాల ఒత్తిడికి త‌లొగ్గిన కేంద్రం
  • జేపీసీకి వక్ఫ్ సవరణ బిల్లు
  • లోక్​సభలో బిల్లు ప్రవేశపెట్టిన కిరణ్ రిజిజు.. తీవ్రంగా వ్యతిరేకించిన అపొజిషన్ పార్టీలు
  • రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని ఫైర్
  • బిల్లును సమర్థించుకున్న కేంద్రం
  • పారదర్శకత కోసమే సవరణలు అని వెల్లడి

న్యూఢిల్లీ: వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్​సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డాయి. ముస్లింల ప్రాథమిక హక్కులను ఎన్డీయే సర్కార్ హరిస్తున్నదని ఫైర్ అయ్యాయి. జేపీసీకి వక్ఫ్ సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపించాలన్న ప్రతిపక్షాల డిమాండ్​కు కేంద్రం తలొగ్గింది. ఈ మేరకు వక్ఫ్‌‌ సవరణ బిల్లును జేపీసీకి పంపిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీనికి ముందు ప్రతిపక్ష  నేతలు కేంద్రంపై ఫైర్ అయ్యారు. వక్ఫ్ సవరణ బిల్లుకు అంగీకరించేదే లేదని తేల్చి చెప్పారు. ఈ బిల్లు తీసుకొచ్చి రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ముస్లింల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా వక్ఫ్ చట్టంలో సవరణలు ఏంటని నిలదీశారు. అపోజిషన్ పార్టీ నేతల ఆరోపణలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తోసిపుచ్చారు. బిల్లును సమర్థించుకున్నారు. ముస్లింల మేలు కోసమే వక్ఫ్ చట్టంలో సవరణలు చేస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ.. అపోజిషన్ నేతల నుంచి వ్యతిరేకత ఎదురవడంతో.. బిల్లును జేపీసీకి పంపుతామని  రిజిజు ప్రకటించారు.‘‘వక్ఫ్ యాక్ట్ 1995కి సవరణలతో ముస్లింలకు  అన్యాయం జరగదు. వక్ఫ్ చట్టంలోని సమస్యలను గతంలో కాంగ్రెస్ సర్కార్ పరిష్కరించలేదు. మేం సవరణలు చేస్తుంటే అడ్డుకుంటున్నరు. మీకు చేతగాకపోవడంతోనే ఈ సవరణలు తేవాల్సి వచ్చింది’’అని  అన్నారు. 

వక్ఫ్ బోర్డులు.. మాఫియాగా మారినయ్

కొందరు వక్ఫ్‌‌ బోర్డులను కబ్జా చేశారని, సామాన్య ముస్లింలకు న్యాయం చేసేందుకే ఈ బిల్లు తీసుకొచ్చామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ముస్లిం మతపరమైన, ధార్మిక ప్రయోజనాల కోసం దానంగా వచ్చిన ఆస్తుల్ని పర్యవేక్షించే వక్ఫ్‌‌ బోర్డ్‌‌లో  పారదర్శకత కోసమే  సవరణలు చేస్తున్నామని  తెలిపారు. ‘‘తమిళనాడు తిరుచిరాపల్లిలో 1,500 ఏండ్ల నాటి సుందరేశ్వర ఆలయం ఉంది. ఓ వ్యక్తి తన ఆస్తిని అమ్ముకునేందుకు అక్కడికెళ్లాడు. కానీ.. ఆ గ్రామస్తులంతా అతని భూమిని వక్ఫ్ ప్రాపర్టీగా తేల్చేశారు. ఇదెలా సాధ్యం?’’అని  రిజిజుప్రశ్నించారు. 

స్పీకర్ హక్కులపై రగడ

 లోక్​సభ స్పీకర్ హక్కులపై సమాజ్​వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్​ అఖిలేశ్​యాదవ్​, కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్​షా మధ్య గురువారం మాటల యుద్ధం కొనసాగింది. వక్ఫ్​ బిల్లుపై సభలో చర్చ సందర్భంగా అఖిలేశ్​మాట్లాడుతూ.. ప్రతిపక్షాల హక్కులతోపాటు స్పీకర్​రైట్స్​ను కూడా కాలరాస్తున్నారని ఆరోపణలు చేశారు. “మీ హక్కులు లాక్కొంటున్నారు. మీ తరఫున పోరాడేందుకు మేం సిద్ధం” అని స్పీకర్​ను ఉద్దేశించి అన్నారు.

 అఖిలేశ్​ వ్యాఖ్యలపై హోంమంత్రి అమిత్​ షా స్పందిస్తూ.. ఇది స్పీకర్​ను అవమానించడమే అంటూ ఫైర్​ అయ్యారు. స్పీకర్‌‌ హక్కులకు ప్రతిపక్షాలు పరిరక్షకులు కాదని అన్నారు. కాగా, ఒలింపిక్స్ లో రెజ్లర్ వినేశ్ ఫోగాట్ అనర్హత అంశం రాజ్యసభలో  ప్రతిపక్షాలకు, చైర్మన్ కు మధ్య మాటల యుద్ధానికి దారిసింది. ప్రతిపక్షాల తీరుపై చైర్మన్ ధన్ ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు. తిరిగి వచ్చాక దీనిపై చర్చకు నో చెప్పారు. దీంతో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.  

ఇది రాజ్యాంగంపై దాడే: కేసీ వేణుగోపాల్ 

వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టడమంటే.. రాజ్యాంగంపై దాడి చేయడమే అని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. కేంద్రం మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నదని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమే తరులను నియమించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారని ఫైర్ అయ్యారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీ సేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని సమాజ్‌‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. రాజకీయ కోణంలో భాగంగా ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టినట్లు ఆరోపించారు.  

కేంద్రం ఏం చెప్తోంది?

ఆర్మీ, రైల్వే తర్వాత మన దేశంలో ఎక్కువగా భూములు వక్ఫ్ బోర్డుకే ఉన్నాయి.  ఈ నేపథ్యంలోనే వక్ఫ్‌‌ బోర్డుకు విస్తృత అధికారాలను గత ప్రభుత్వాలు కట్టబెట్టాయి. ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు 2009 తర్వాత రెట్టింపు అయ్యాయి.  దేశంలో ఇతర మతాలకు చెందిన మఠాలకు, అఖాడా, ట్రస్ట్‌‌లు, సొసైటీలకు లేని అపరిమిత అధికారాలను,  స్వతంత్ర హోదాను వక్ఫ్‌‌ బోర్డులకు కట్టబెట్టారు.   ముస్లిం మతపరమైన, ధార్మిక ప్రయోజనాల కోసం దానంగా వచ్చిన ఆస్తుల్ని వక్ఫ్‌‌ బోర్డ్‌‌ పర్యవేక్షిస్తూ ఉంటుంది. స్థిర, చరాస్తులను వక్ఫ్ ప్రాపర్టీలుగా పేర్కొంటారు. వక్ఫ్ ఆస్తిని ట్రాన్స్ ఫర్ చేయడం కుదరదు. ఇది దేవుని పేరు మీద శాశ్వతంగా ఉంటుంది. వక్ఫ్ నుంచి వచ్చే ఆదాయం సాధారణంగా విద్యా సంస్థలు, శ్మశాన వాటికలు, మసీదులు, షెల్టర్ హోమ్ ల నిర్వహణకు ఉపయోగించాలి. కానీ.. ఇది జరగడం లేదు. 

ప్రతిపక్షాల వాదనేంటి?

వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సభ్యులను నియమించడం సరికాదు.  వక్ఫ్ భూములను గుంజుకోవాలని కేంద్రం కుట్ర చేస్తున్నది.  ముస్లింల అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదు? ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు.. బోర్డులో సభ్యులను ఎందుకు నామినేట్‌‌ చేయాలనుకుంటున్నరు? ఇంత హడావుడిగా కేంద్రం ఈ బిల్లు తీసుకురావడానికి వక్ఫ్ బోర్డులో అంత పెద్ద అవినీతి ఏం జరిగిందో అర్థం కావడంలేదు.  సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరు మహిళలు తప్పనిసరిగా ఉండాలనే రూల్ ఎందుకు? కేంద్రం మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నది. ముస్లింల హక్కులను కాలరాస్తున్నది.  బిల్లుపై విస్తృత అభిప్రాయాలు తీసుకున్నమని అంటున్నరు? కానీ ఎక్కడెక్కడ ఒపీనియన్లు తీసుకున్నరో చెప్పట్లేదు. వక్ఫ్ చట్టంలో సెక్షన్ 40ని ఎత్తేయాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియట్లేదు.  

వక్ఫ్ బిల్లు, 2024లో సవరణలు ఏమిటి?

  • n    1995 నాటి వక్ఫ్‌‌ చట్టంలో సెక్షన్ 40ని తొలగించాలని బిల్లులో కేంద్రం స్పష్టం చేసింది. ఏదైనా ఒక ఆస్తి వక్ఫ్ బోర్డుదా..? కాదా? అని ఈ సెక్షన్ 40 నిర్ణయిస్తుంది. బోర్డుకు విస్తృత అధికారాన్ని ఈ సెక్షన్ కట్టబెట్టింది. 
  • n    సింపుల్​గా చెప్పాలంటే వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులను నిర్వహించే అధికారాన్ని పరిమితం చేయడం, మరింత ప్రభుత్వ నియంత్రణకు వీలు కల్పించడం ఈ బిల్లు లక్ష్యం.
  • n    ఏదైనా వక్ఫ్ ఆస్తికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని ఈ బిల్లు సూచిస్తున్నది. దీంతో ఆస్తిని అసెస్​మెంట్ చేయవచ్చని బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. 
  • n    ఈ చట్టం అమల్లోకి రాకముందు లేదా తర్వాత వక్ఫ్ ఆస్తిగా గుర్తించిన లేదా ప్రకటించిన ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదని పేర్కొంది.
  • n    ఒక ప్రాపర్టీ వక్ఫ్ ఆస్తినా? లేక ప్రభుత్వ భూమినా? అనేది జిల్లా కలెక్టర్ నిర్ణయిస్తారని, ఆయన నిర్ణయమే అంతిమమని బిల్లులో ప్రతిపాదించారు. 
  • n    కలెక్టర్ నిర్ణయం తీసుకున్న తర్వాత రెవెన్యూ రికార్డుల్లో అవసరమైన మార్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించవచ్చు. 
  • n    కలెక్టర్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించే దాకా ఆ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదని బిల్లులో పేర్కొన్నారు.
  • n    వక్ఫ్‌‌ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం రానున్నది.
  • n    ఇందులో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేందుకు కేంద్రం ప్రతిపాదించింది.
  • n    వక్ఫ్ బోర్డులో మహిళలు, ఓబీసీ ముస్లింలు, షియా, బోహ్ర తదితర ముస్లింలకు చోటు కల్పించాలనేది ఈ బిల్లు లక్ష్యం.
  • n    సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరు మహిళలు తప్పనిసరిగా ఉండాలని బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. 
  • n    వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే డబ్బును ప్రభుత్వం సూచించిన పద్ధతిలో వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, అనాథల సంక్షేమానికి ఉపయోగించాలని బిల్లు సూచిస్తుంది.