
- పోలవరం–బనకచర్ల లింక్‌కు అనుమతులు ఇవ్వలేమన్న కేంద్రం
- ఏపీ ప్రతిపాదనలు తిప్పి పంపిన పర్యావరణ శాఖ
- వరద జలాల మీద మరోసారి స్టడీ చేయాలి
- అంతర్రాష్ట్ర వివాదాలపైన సీడబ్ల్యూసీతో చర్చించాలని సూచన
- ఫలించిన తెలంగాణ సర్కారు పోరాటం
- వరుస ఫిర్యాదులతో వెనక్కి తగ్గిన కేంద్రం
హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర సర్కారు పోరాటానికి ఫలితం దక్కింది. సీఎం రేవంత్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ వరుస ఫిర్యాదులతో పోలవరం– బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లొద్దని ఏపీకి కేంద్రం తేల్చి చెప్పింది. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని స్పష్టంచేసింది. గోదావరిలో మిగులు జలాలు లేవంటున్నారని, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)తో స్టడీ చేయించాలని సూచించింది.
ఈ నెల 17న నిర్వహించిన 33వ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) మీటింగ్ మినిట్స్ ను సోమవారం కేంద్ర పర్యావరణ శాఖ విడుదల చేసింది. ప్రాజెక్ట్‌కు అనుమతులు ఇవ్వొద్దంటూ కేంద్ర జలశక్తి శాఖ, పర్యావరణ శాఖలకు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ వరుసగా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం పోలవరం– బనకచర్లకు పర్మిషన్లు ఇవ్వలేమని చెప్పింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను కేంద్రం ప్రస్తావించింది.
గోదావరి జలాల విషయంలో గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) వివాదాలున్నాయని, వాటిపై సంబంధిత రాష్ట్రాలతో చర్చించాకే ముందుకు వెళ్లాలని ఏపీకి కేంద్రం తేల్చి చెప్పింది.
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై ‘వెలుగు పత్రిక’లో వచ్చిన వరుస కథనాలతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. మంత్రి ఉత్తమ్ జనవరిలో కేంద్రానికి ఫిర్యాదు చేశారు. గోదావరి ట్రిబ్యునల్ వివాదాలున్నాయని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వొద్దని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు లేఖ రాశారు. ఇటు ఆర్థిక అనుమతులు ఇవ్వొద్దని, సాయం చేయొద్దని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు కూడా లేఖ అందించారు.
ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ మార్చిలోనే నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు ఎలా విఘాతం కలుగుతుందో వివరించారు. సర్కారు ఫిర్యాదులతో మే 28న అన్నీ చూశాకే అనుమతులు ఇస్తామని, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరిగే నిర్ణయం తీసుకోబోమని సీఆర్ పాటిల్ మంత్రి ఉత్తమ్ కు లేఖ రాశారు. టీవోఆర్ ఆమోదం కోసం ఏపీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా.. ఈ నెల14న మంత్రి ఉత్తమ్ మరోసారి కేంద్రానికి లేఖ రాశారు.
బనకచర్ల ప్రాజెక్ట్ డీపీఆర్ ను కేంద్రం అడగడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈ నెల 17న నిర్వహించిన ఈఏసీ మీటింగ్‌లో దీనిపై చర్చించిన కేంద్రం.. అనుమతులు ఇప్పుడు ఇవ్వడం కష్టమని తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
ఏపీ ప్రతిపాదనలు వెనక్కి పంపుతూ మూడు అంశాలపై సిఫార్సులు చేసిన ఈఏసీ
(ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ)
- 1) సీడబ్ల్యూసీ వరదజలాల లభ్యతపై సమ్రగ స్టడీ చేయాలి.
- 2) 1980 గోదావరి ట్రిబ్యునల్ అవార్డు (తీర్పు)కు విరుద్ధంగా బనకచర్ల ప్రాజెక్టు ఉందన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
- 3) అంతర్రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా తయా రీకి ముందు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై స్పష్టత కోసం సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోవాలి.
పర్యావరణానికి నష్టం..
ప్రాజెక్ట్‌తో పర్యావరణానికి నష్టమని కేంద్రం స్పష్టం చేసింది. నీటిని తీసుకెళ్లే మార్గంలో టైగర్ రిజర్వు, నల్లమల ఫారెస్ట్ రేంజ్ ఉందని, గుట్టని తొలిస్తే ఇటు పర్యావరణానికి అటు జీవ వైవిధ్యానికి నష్టం జరుగుతుందని పేర్కొంది. టైగర్ రిజర్వ్ జోన్ దాటాక 19.50 కిలోమీటర్ల టన్నెల్‌ను పరిశీలించవచ్చని సూచించింది. కానీ మిగులు జలాల లభ్యత, అంతర్రాష్ట్ర వివాదాల నేపథ్యంలో ఇప్పుడు ప్రాజెక్ట్‌కు అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పింది.