
- 15 శాతానికి తగ్గే అవకాశం
- ప్రపోజల్‌ను పరిశీలిస్తున్న కేంద్రం
న్యూఢిల్లీ:టెస్లా వంటి ఎలక్ట్రిక్ వెహికల్స్(ఈవీ) కంపెనీలను ఆకర్షించడానికి కరెంట్ బండ్లపై దిగుమతి సుంకాలను తగ్గించాలని కేంద్ర భావిస్తోంది. భారతదేశంలోనూ ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంటును స్థాపించాలని అమెరికా కంపెనీ టెస్లా ప్లాన్ చేసినప్పటికీ, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మొదట దిగుమతి సుంకాన్ని తగ్గించాలని టెస్లా డిమాండ్ చేస్తోంది. తద్వారా దిగుమతి చేసుకోవడం ద్వారా దేశంలో అధికారికంగా ఎలక్ట్రిక్ కార్లను అమ్ముతామని చెబుతోంది. దిగుమతి సుంకంలో ఎలాంటి తగ్గింపూ ఉండదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. టెస్లా తప్పనిసరిగా ఇండియాలోనే తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరింది. ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను స్థానికంగా ఉత్పత్తి చేసి అమ్మాలని డిమాండ్ చేస్తోంది. ఇందుకు టెస్లా ఇష్టపడటం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం సుంకాలను తగ్గించే ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లాను దేశంలోకి ఆకర్షించే లక్ష్యంతో ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై దిగుమతి సుంకాలను తగ్గించే ప్రపోజల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇండియాలోనే ప్లాంట్‌ను ఏర్పాటు చేసేలా టెస్లాను ఆకర్షించేందుకు అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతానికి తగ్గించాలని భారత
ప్రభుత్వం చూస్తోంది.
మరిన్ని కంపెనీల రాక
సుంకం తగ్గింపు వల్ల భారతదేశంలోకి మరిన్ని ఈవీ కంపెనీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మస్క్ కంపెనీ భారతదేశంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తోంది. సుంకాలు తగ్గిస్తే ప్లాంటు పనులు వేగవంతం కావడానికి అవకాశాలు ఉంటాయని ఎక్స్పర్టులు అంటున్నారు. అయితే టెస్లా చవక ఎలక్ట్రిక్ కారును తన జర్మనీ ప్లాంట్‌లో తయారు చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడయింది. చవక కారును టెస్లా భారతదేశంలో తయారు చేస్తుందని భావించారు. అయితే టెస్లా ఈ విషయంలో మనసు మార్చుకుంది. మోడల్ 3 సెడాన్ ధర సుమారు 27,000 డాలర్లు (దాదాపు రూ.22.50 లక్షలు) ఉంటుంది. ప్రస్తుత రూల్స్ ప్రకారం 40,000 డాలర్ల (రూ.33.31 లక్షలు) కంటే తక్కువ ధర గల కార్ల దిగుమతిపై 70 శాతం సుంకం విధిస్తారు. ఇంతకంటే ఎక్కువ ధర ఉంటే 100 శాతం సుంకం కట్టాలి. ఈ సుంకాన్ని 15 శాతానికి తగ్గించాలని టెస్లా కోరుతోంది. భారతదేశంలో ప్లాంట్‌ను నిర్మించడానికి కనీసం కొంత కాలం వరకు అయినా సుంకాల్లో రాయితీలు ఇవ్వాలన్నది టెస్లా రిక్వెస్ట్. అయితే, టెస్లాకు అలాంటి ప్రత్యేక రాయితీని అందించే ఆలోచన లేదని భారత ప్రభుత్వం మొదట వెల్లడించింది. అయితే అన్ని ఈవీ కంపెనీలకూ సుంకాలను తగ్గించాలన్నది కేంద్రం తాజా ఆలోచన.
ALSO READ : 115 సిటీల్లో జియో ఎయిర్‌ఫైబర్