మార్కాపురం బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు కేంద్రం ఎక్స్‎గ్రేషియా

మార్కాపురం బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు కేంద్రం ఎక్స్‎గ్రేషియా

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‎లోని మార్కాపురం జిల్లా బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో ప్రయాణికులు సజీవదహనం కావడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పన నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‎లో  గురువారం (మార్చి 26) తెల్లవారుజూమున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని పలకల క్వారీ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్‎ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం కాగా.. 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా.. 10 మంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. 

ప్రమాదానికి గురైన బస్సు నిర్మల్ నుంచి పామూరు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల హాహాకారాలు, ఆక్రందనలు, మంటలతో ఘటన స్థలం భీతావాహంగా మారింది.