
- మేం మూడేండ్లలోనే ఇంటింటికీ నల్లా పూర్తి చేసినం
- దేశానికే మిషన్ భగీరథ ఆదర్శమని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘‘ఇప్పటికే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, మొబైల్ వెటర్నరీ క్లీనిక్‌లను కేంద్రం కాపీ కొట్టింది. ఇక్కడ అమలవుతున్న ఇంకా ఎన్నో పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలి” అని డిమాండ్ చేశారు. గురువారం మిషన్ భగీరథ హెడ్ క్వార్టర్స్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మిషన్ భగీరథ పథకానికి కేంద్ర జల్‌జీవన్ మిషన్ అవార్డు ప్రకటించిందని, రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రశంసించిందని తెలిపారు. కేంద్రం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 320 గ్రామాల్లో సర్వే చేయించి ఈ అవార్డుకు ఎంపిక చేసిందన్నారు. రెండు రోజులకోసారి రాష్ట్రానికి వచ్చి ఇక్కడి ప్రభుత్వంపై బురద జల్లే కేంద్ర మంత్రులు ఈ అవార్డులతోనైనా కండ్లు తెరవాలని ఆయన దుయ్యబట్టారు. ఏడేండ్లలోనే సీఎం కేసీఆర్ తాగునీరు, కరెంట్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించారని అన్నారు. పాదయాత్రలు చేస్తున్న నాయకులకు ప్రజలు ఎక్కడా కరెంట్, తాగునీటి సమస్యల గురించే ప్రస్తావించడం లేదంటే ప్రభుత్వం ఆయా రంగాల్లో ఎంతటి కృషి చేసిందో గుర్తించాలని చెప్పారు. మిషన్ భగీరథను ప్రధాని మోడీ మన్‌కీ బాత్‌లోనూ ప్రస్తావించి అభినందించారని హరీశ్ అన్నారు. దేశానికే మిషన్ భగీరథ ఆదర్శమని పేర్కొన్నారు. ‘‘ఢిల్లీలో ప్రశంసలు.. గల్లీలో విమర్శలు అన్నట్టుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరు ఉంది” అని విమర్శించారు.
అవార్డులతో పాటు నిధులియ్యాలి: ఎర్రబెల్లి
తెలంగాణకు వచ్చినన్ని అవార్డులు దేశంలో ఇంకే రాష్ట్రానికి రావడం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బోర్ నీళ్లతో ప్రజలకు రోగాలు వస్తున్నాయని గుర్తించే సీఎం కేసీఆర్ మిషన్ భగీరథకు రూపకల్పన చేశారన్నారు. కేంద్రం అవార్డులతో పాటు రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సర్పంచ్‌లకు తాగునీటి సరఫరా కష్టాలు లేవు
ఉమ్మడి రాష్ట్రంలో సర్పంచులు తాగునీటి సరఫరా చేయడానికే ఐదేండ్లు కష్టపడేవారని, చివరికి అప్పులతోనే వాళ్ల పదవీకాలం పూర్తయ్యేదని, ఇప్పుడు ఒక్క సర్పంచ్ కూడా తాగునీటి సరఫరా కోసం ఇబ్బంది పడాల్సిన పనిలేకుండా పోయిందని హరీశ్‌రావు అన్నారు. దేశవ్యాప్తంగా కేవలం 50 శాతం ఇండ్లకే తాగునీటిని నల్లాల ద్వారా ఇస్తున్నారని, తెలంగాణలో మాత్రం మొత్తం ఇండ్లకు నల్లాలతో నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణలో ఫ్లోరైడ్ లేకుండా పోయిందని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్‌లో చెప్పిందన్నారు. ‘‘ఇక్కడ రాజకీయం చేయాలని చూస్తున్న బీజేపీ.. ప్రజల మన్ననలు పొందాలంటే నీతి ఆయోగ్ సిఫార్సు చేసినట్టుగా మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు ఇవ్వాలి. 15వ ఆర్థిక సంఘం స్టేట్ స్పెసిఫిక్, సెక్టార్ స్పెసిఫిక్ కింద తెలంగాణకు గ్రాంట్‌గా ఇవ్వాలని సూచించిన రూ.5,300 కోట్లు విడుదల చేయాలి” అని డిమాండ్ చేశారు. గుజరాత్‌లో ఇంటింటికీ నీళ్లు ఇచ్చామని బీజేపీ నాయకులు చెప్తున్నారని, ఆ స్కీం 15 ఏండ్లయినా, కేంద్రం రూ.2,500 కోట్లు ఇచ్చినా ఇంకా పూర్తి కాలేదని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణలో మూడేండ్లలోనే ప్రతి ఇంటికి నల్లా పెట్టి రక్షిత నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంట్, రైతుబీమా పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.