భువ‌న‌గిరి కోట‌ అభివృద్దికి కేంద్రం చొర‌వ తీసుకోవాలి

భువ‌న‌గిరి కోట‌ అభివృద్దికి కేంద్రం చొర‌వ తీసుకోవాలి
  • లోక్‌స‌భ‌లో ప్ర‌స్తావించిన భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండలో చారిత్రకమైన భువ‌న‌గిరి కోట‌ అభివృద్ధికి కేంద్రం చొరవ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కోరారు. కోట అభివృద్ధికి నిధులు కేటాయించడంతోపాటు  కేబుల్ కార్ (రోప్‌వే) నిర్మాణం చేప‌ట్టాల‌ని రూల్ 377  క్రింద లోక్‌స‌భ‌లో కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ప్ర‌స్తావించారు. ఎంతో గొప్ప చరిత్ర క‌లిగిన భువ‌న‌గిరి కోట‌పై కేబుల్ కార్ (రోప్‌వే) నిర్మించడంతో పాటు కోట అభివృద్దికి అవ‌స‌ర‌మైన నిధులు కేటాయిస్తే ఈ ప్రాంతం మంచి అభివృద్ధి సాధిస్తుందన్నారు. 
భువ‌న‌గిరి కోట నిర్మాణం అద్భుతంగా ఉండ‌డంతో పాటు ప‌ర్యాట‌క  ప్రియులను, ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడ‌లు ఇష్టపడే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలిపారు. పైగా ఈ కోట‌కు రోడ్డు, రైలు ద్వారా ర‌వాణా సౌక‌ర్యం క‌లిగి ఉందని ఆయన తెలిపారు.

అంతేకాదు రాష్ట్ర రాజ‌ధానికి కేవ‌లం 48 కిలోమీటర్ల దూరంలోనే ఉంద‌ని ఆయన వివ‌రించారు. పర్యాటకుల సౌకర్యార్థం కోటకు కేబుల్ కార్ (రోప్ వే) వేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. టెండ‌ర్లు పిల‌వ‌డం వాటిని ర‌ద్దు చేయ‌డం జరిగింద‌న్నారు. 2016లో రెండ‌వ‌సారి టెండ‌ర్లు పిలిచి ఎలాంటి కార‌ణాలు లేకుండా ప్ర‌భుత్వం టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేసింద‌ని వివ‌రించారు. రాష్ట్ర స‌ర్కార్ కోట అభివృద్ది పై ఆల‌స‌త్వం వ‌హిస్తుంద‌ని ఆయన వెల్ల‌డించారు. దేశంలోని సంస్కృతి వార‌సత్వ సంప‌ద‌ను ర‌క్షించ‌డానికి ప్ర‌ధాని మోదీ కంకణం క‌ట్టుకుంటే భువ‌న‌గిరి కోట అభివృద్దికి కావాల్సిన నిధుల‌ను కేంద్రం మంజూరు చేయాల‌ని కోరారు.