ఢిల్లీలో కేంద్రం ఆర్డినెన్స్ ను వాపస్ తీస్కోవాలె

ఢిల్లీలో కేంద్రం ఆర్డినెన్స్ ను వాపస్ తీస్కోవాలె
  • ఢిల్లీలో కేంద్రం ఆర్డినెన్స్ ను వాపస్ తీస్కోవాలె
  • గవర్నర్ వ్యవస్థతో ఏదో చేయాలని మోడీ చూస్తున్నరు
  • ఎమర్జెన్సీ దిశగా కేంద్రంలోని బీజేపీ పోతున్నది
  • కేజ్రీవాల్​కు మద్దతుగానిలబడ్తమని వెల్లడి
  • సుప్రీం ఆదేశాలనూ ప్రధాని గౌరవిస్తలే: కేజ్రీవాల్
  • బీజేపీ ఆఫీసుల్లా రాజ్ భవన్లు: మాన్

హైదరాబాద్, వెలుగు: సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఢిల్లీ అధికారాలపై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌‌‌‌ను వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. అలంకారప్రాయమైన గవర్నర్‌‌ వ్యవస్థతో ఏదో చేయాలని మోడీ చూస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌‌లపై కేంద్రం ఆర్డినెన్స్‌‌ తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నేతల మద్దతు కోరుతున్న ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌‌.. శనివారం సీఎం కేసీఆర్‌‌తో భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌‌లో జరిగిన సమావేశం తర్వాత కేజ్రీవాల్‌‌, పంజాబ్‌‌ సీఎం భగవంత్‌‌ సింగ్‌‌ మాన్‌‌లతో కలిసి కేసీఆర్‌‌ మీడియాతో మాట్లాడారు. 

‘‘ఇందిరాగాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీ దిశగా కేంద్రంలోని బీజేపీ పోతున్నది. అంతకంటే అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. ఎమర్జెన్సీని వ్యతిరేకించే బీజేపీ నేతలు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారు. సుప్రీంకోర్టు మెజార్టీ బెంచ్ తీర్పును కాలరాసే పరిస్థితులు దేశంలో ఉన్నాయి. సాగు చట్టాలను వాపస్ తీసుకున్నట్లుగానే.. మీకు మీరే ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలి” అని డిమాండ్ చేశారు. తాము కేజ్రీవాల్ తరఫున నిలబడతామని, ఆయనకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. లోక్ సభ, రాజ్యసభల్లో తమ శక్తినంతా ఉపయోగించి ఆర్డినెన్స్ బిల్లు పాస్ కాకుండా చేస్తమన్నారు. మోడీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను అవమానిస్తున్నదని, వాళ్లు భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

ముప్పుతిప్పులు పెడుతున్రు

దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆగడాలు, అరాచకాలు మితిమీరుతున్నాయని, పరాకాష్టకు చేరుకుంటున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. కర్నాటక ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని, అయినా బీజేపీకి బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పుతిప్పులు పెడుతూ పని చేయనీయడం లేదని ఆరోపించారు. ‘‘నాన్ – బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో వెంటపడి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఆర్థిక పరిమితులు విధించడం, దాడులు చేస్తూ వేధించడం, ఇంకా అనేక రకాలైన దుర్మార్గాలకు బీజేపీ ప్రభుత్వం ఒడిగడుతున్నది” అని విమర్శించారు. రెండు జాతీయ పార్టీలను మట్టికరిపించి అర్వింద్ కేజ్రీవాల్ బ్రహ్మాండమైన మెజార్టీతోని ఢిల్లీలో గెలిచారని చెప్పారు. ‘‘ఢిల్లీలో ఆప్ వెరీ పాపులర్ పార్టీ.  ఇది యావత్ దేశానికి, ప్రపంచానికంతటికీ తెలిసిన విషయమే. కేజ్రీవాల్ నాయకత్వంలో ఒక సోషల్ మూవ్ మెంట్ నుంచి వచ్చిన పార్టీయే ఆప్ ” అని అన్నారు.

రాజ్యసభలో అడ్డుకుంటం: కేజ్రీవాల్

రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేదని, ప్రతిపక్షాలన్నీ కలిసి ఈ ఆర్డినెన్స్ బిల్లు పాస్ కాకుండా రాజ్యసభలో అడ్డుకుంటామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. తమకు మద్దతు తెలిపినందుకు యావత్ ఢిల్లీ ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఇది ఢిల్లీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య మాత్రమే కాదని, యావత్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యని చెప్పారు. ‘‘2015 ఫిబ్రవరిలో మేం మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. మూడు నెలల్లోనే మోడీ సర్కార్ ఒక నోటిఫికేషన్ జారీ చేసి మా అధికారాలను లాక్కుంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా నాకు కనీసం హెల్త్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ తదితరులను ట్రాన్స్ ఫర్ చేసే అధికారం కూడా లేకుండా పోయింది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారాలన్నీ హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లి కొట్లాడి తెచ్చుకోవాల్సి వచ్చింది.

ఇటీవలే సుప్రీంకోర్టు మెజార్టీ బెంచ్ మా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు నిచ్చింది. కానీ ఎనిమిది రోజుల్లోనే సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను తెచ్చింది” అని చెప్పారు. ఈ దేశ ప్రధాన మంత్రి సుప్రీంకోర్టు ఆదేశాలనూ గౌరవించడం లేదని, మరి ప్రజలు న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా మద్దతు కోరుతున్నామని అన్నారు. ‘‘బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలను పనిచేయనివ్వడం లేదు. వేరే పార్టీల ఎమ్మెల్యేలను కొంటున్నారు. ఈడీ, ఐటీ, సీబీఐలతో వేధింపులు, దాడులు చేయిస్తున్నారు. ప్రభుత్వాలను కూల్చుతున్నారు. ఆర్డినెన్స్ లు తెస్తున్నారు. గవర్నర్లతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. తెలంగాణలోనూ కొన్ని బిల్లులు గవర్నర్​ దగ్గర పెండింగ్​లోనే ఉన్నాయి” అని అన్నారు.  

ఫొటోలు దిగేందుకు నీతి ఆయోగ్ మీటింగ్‌కు పోవాల్నా?: భగవంత్ మాన్

ప్రజాస్వామ్యం ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ అన్నారు. నీతి ఆయోగ్‌ భేటీని బహిష్కరించడంపైనా ఆయ స్పందించారు. ‘‘ఫొటోలు దిగేందుకే నీతి ఆయోగ్‌ భేటీకి వెళ్లాల్సి వస్తున్నది. నీతి ఆయోగ్‌ ప్రతిపాదనలను కేంద్ర సర్కార్‌ పాటించదు. రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్లను వినదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని మనం గొప్పగా చెప్పుకుంటాం. కానీ భిన్న సంస్కృతులకు నిలయమైన దేశంలో ఒకే విధానాన్ని బీజేపీ ఆశిస్తున్నది. రాజ్‌భవన్లు బీజేపీ ఆఫీసుల్లా పనిచేస్తున్నాయి. తెలంగాణ బిల్లులను ఆపారు. మా ప్రభుత్వ బిల్లులను కూడా ఆపుతున్నారు” అని చెప్పారు.

సుప్రీం తీర్పును కాలరాస్తరా?

‘‘లెఫ్టినెంట్ గవర్నర్‌‌ను ప్రభుత్వం నెత్తినపెట్టి అనేక దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నరు. ఢిల్లీ అధికారాలపై కేజ్రీవాల్ ప్రభుత్వం చివ రికి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. చీఫ్ జస్టిస్​తో కూడుకున్న ఐదుగురు సభ్యుల మెజార్టీ బెంచ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కిందనే అధికారులందరూ పనిచేయాలని, వాళ్ల ట్రాన్స్ ఫర్స్, మంచీ చెడులు, నియంత్రణలు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలని, లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో కాదని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది” అని కేసీఆర్ అన్నారు. గెలిచిన ప్రభుత్వాన్ని పనిచేయనీయకపోవడం అరాచకమన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్​ను కాలరాసేలా ఆర్డినెన్స్ ను తీసుకురావడం దుర్మార్గమని మండిపడ్డారు.