- కేంద్రానికి రాష్ట్రం నుంచి ట్యాక్స్‌ల రూపంలో
- రూ. 4.32 లక్షల కోట్లు.. ఏపీ నుంచి రూ.3.32 లక్షల కోట్లు
- కేంద్రం నుంచి ఐదేండ్లలో ఏపీకి రూ.3.23 లక్షల కోట్లు
- తెలంగాణకు ఇచ్చింది రూ.1.84 లక్షల కోట్లే
హైదరాబాద్, వెలుగు: పన్నుల వసూళ్లలో సింహభాగం అందిస్తున్నా.. నిధుల పంపిణీలో మాత్రం తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోంది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణకు మొండిచేయి చూపిస్తూ, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం పెద్దపీట వేస్తోంది. గత ఐదు ఆర్థిక సంవత్సరాలకు(2020-–21 నుంచి 2024–25 వరకు) సంబంధించిన పన్నుల ఆదాయం, రాష్ట్రాలకు చేసిన కేటాయింపులపై రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ఈ చేదు నిజాన్ని బట్టబయలు చేసింది.
సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన గణాంకాలను పరిశీలిస్తే.. దక్షిణాది రాష్ట్రాల పట్ల, మరీ ముఖ్యంగా తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. గత ఐదేళ్లలో ప్రత్యక్ష పన్నులు (డైరెక్ట్ ట్యాక్స్), స్థూల జీఎస్టీ రూపంలో తెలంగాణ నుంచి కేంద్ర ఖజానాకు ఏకంగా రూ. 4.32 లక్షల కోట్లు (మొత్తం వసూళ్లలో 3.87 %) వెళ్లాయి.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లింది రూ. 3.32 లక్షల కోట్లు (2.97 %) మాత్రమే. అంటే ఏపీ కంటే తెలంగాణ సుమారు లక్ష కోట్ల రూపాయలను అదనంగా కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లించింది. ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి వల్లే ఇంతటి భారీ మొత్తాన్ని కేంద్రానికి సమకూర్చగలిగింది.
అయినా సరే, కేంద్రం మాత్రం తెలంగాణ నుంచి తీసుకున్న దాంట్లో సగం కూడా తిరిగి ఇవ్వలేదని గణాంకాలు చెబుతున్నాయి. గ్రాంట్ల విషయంలోనూ రాష్ట్రానికి అన్యాయమే జరిగింది. రెవెన్యూ లోటు గ్రాంటు పేరుతో ఏపీకి ఏటా భారీగా నిధులు అందుతుండగా, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రమనే నెపంతో తెలంగాణకు ఆ గ్రాంట్లు దక్కడం లేదు. పోనీ కేంద్ర ప్రాయోజిత పథకాల్లోనైనా న్యాయం జరిగిందా? అంటే అదీ లేదు. ఎన్ఆర్ఈజీఎస్ వంటి పథకాల్లోనూ, ఇతర ప్రాజెక్టుల నిధుల విడుదలలోనూ కేంద్రం కొర్రీలు పెడుతూనే ఉంది. ఏపీకి పోలవరం సహా ఇతర మార్గాల్లో నిధులు సర్దుబాటు అవుతుండగా, తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా గానీ, ప్రత్యేక నిధులు గానీ ఇవ్వకుండా కేంద్రం దాటవేత వైఖరిని అవలంబిస్తోందని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
యూపీ.. బిహార్‌కు ఇలా
కేంద్రం వెల్లడించిన వివరాలలో ఉత్తరప్రదేశ్ నుంచి గత ఐదేళ్లలో కేంద్రానికి వచ్చింది రూ. 5.14 లక్షల కోట్లు కాగా, ఆ రాష్ట్రానికి కేంద్రం తిరిగి ఇచ్చింది రూ. 11.88 లక్షల కోట్లు. అంటే యూపీ కట్టిన దానికంటే రెట్టింపు నిధులు పొందింది. అలాగే బిహార్ కేవలం రూ. 76 వేల కోట్లు (0.68%) మాత్రమే పన్నుల రూపంలో చెల్లించగా, కేంద్రం నుంచి ఏకంగా రూ. 6.50 లక్షల కోట్లు (8.66%) పొందింది. జనాభా ప్రాతిపదికన నిధుల పంపిణీ జరుగుతుండటంతో.. కుటుంబ నియంత్రణ పాటిస్తూ, ఆర్థిక క్రమశిక్షణతో ఉన్న రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోంది.
16వ ఆర్థిక సంఘం సిఫార్సులతో ఇంకా నష్టం
కేంద్ర ప్రభుత్వానికి అరవింద్ పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం సమర్పించిన నివేదిక ప్రకారమే.. 2026 నుంచి 2031 వరకు ఐదేళ్ల పాటు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా ఎలా ఉండాలనేది నిర్ణయించనున్నారు. 15వ ఆర్థిక సంఘం అనుసరించిన ప్రాతిపదికనే16వ కమిషన్ కూడా కొనసాగిస్తే తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది.
ఆదాయ వ్యత్యాసం, జనాభా (2011 లెక్కలు) వంటి అంశాలకు ఎక్కువ వెయిటేజీ ఇస్తే.. ఆర్థికంగా బాగున్న తెలంగాణ వాటా మరింత తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పటికే 15వ సంఘం వల్ల తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ, మరో ఐదేళ్లు అదే మూస ధోరణి కొనసాగితే ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఏపీకి వరాలు.. తెలంగాణకు అరకొర..
తక్కువ పన్నులు కట్టిన ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం వరాల జల్లు కురిపించగా, ఎక్కువ పన్నులు కట్టిన తెలంగాణకు మాత్రం అరకొర నిధులే విదిల్చింది. పన్నుల వాటా, ఆర్థిక సంఘం గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా కేంద్రం నుంచి గత ఐదేళ్లలో ఏపీకి ఏకంగా రూ. 3.23 లక్షల కోట్లు (మొత్తం పంపిణీలో 4.30 శాతం) అందాయి.
కానీ, తెలంగాణకు దక్కింది కేవలం రూ. 1.84 లక్షల కోట్లు (2.45 శాతం) మాత్రమే. అంటే, ఏపీ కంటే రూ. లక్ష కోట్లు ఎక్కువ ఆదాయాన్ని కేంద్రానికి ఇస్తే.. తిరిగి పొందేటప్పుడు మాత్రం ఏపీ కంటే దాదాపు రూ. 1.39 లక్షల కోట్లు తక్కువగా తెలంగాణ దక్కించుకుంది. ఈ వ్యత్యాసం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్రం చూపుతున్న అసమానతలకు అద్దం పడుతోందని విశ్లేషకులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రానికి ఇచ్చిన ప్రతి రూపాయికి దాదాపు అంతే మొత్తాన్ని (సుమారు 97 శాతం) తిరిగి ఏదో ఒక రూపంలో రాబట్టుకోగలిగింది. కానీ తెలంగాణ పరిస్థితి దయనీయంగా ఉంది. రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతి రూపాయిలో కనీసం 43 పైసలు కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొంది. కష్టపడి సంపాదించే రాష్ట్రాల ఆదాయాన్ని తీసుకువెళ్లి, ఉత్తరాది రాష్ట్రాలకు పంచిపెడుతున్నారన్న దక్షిణాది రాష్ట్రాల ఆవేదనకు ఈ గణాంకాలే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
