రామాయంపేట/పెనుబల్లి, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సొంత కుటుంబ సభ్యులే ఒకరిపై మరొకరు పోటీకి దిగుతున్నారు. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు అన్నదమ్ములు, అత్తాకోడళ్లు, తండ్రీకొడుకులు, తల్లీకూతుళ్లు సై అంటే సై అంటూ బరిలో నిలుస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామ సర్పంచ్‌గా తండ్రీకొడుకులు నామినేషన్ వేశారు.
బీసీకి రిజర్వ్ అయిన ఈ గ్రామంలో సర్పంచ్ పదవి కోసం తండ్రీకొడుకులు రామకిష్టయ్య, వెంకటేశ్ పోటీ పడుతున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో తల్లీకూతుళ్లు పోటీకి సై అంటున్నారు. పెనుబల్లి గ్రామం ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో కాంగ్రెస్ తరఫున తేజావత్ సామ్రాజ్యం ఇప్పటికే నామినేషన్ వేశారు. అయితే అదే గ్రామంలో ఉంటున్న సామ్రాజ్యం కూతురు బానోత్ పాప బీఆర్‌ఎస్ తరఫున నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. దీంతో ఇక్కడ ఎన్నిక తల్లీకూతుళ్ల మధ్య సవాల్‌గా మారనుంది.
