- నాడు గుజరాత్ మోడల్‌కు ప్రధానిగా మన్మోహన్ తోడ్పాటు అందించారు
- అదే రీతిలో మీరు కూడా మా రాష్ట్రానికి అండగా ఉండాలి..
- ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి
- రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టును త్వరగా చేపట్టండి
- హైదరాబాద్ టు బెంగళూరు హై స్పీడ్ కారిడార్‌ను అభివృద్ధి చేయండి
- హైదరాబాద్– బెంగళూరు– చెన్నై బుల్లెట్ ట్రైన్ కావాలని వినతి
- పీఎంవోలో ప్రధానమంత్రితో 30 నిమిషాలపాటు భేటీ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ మోడల్‌కు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. నాడు గుజరాత్ మోడల్‌కు ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ అండగా నిలిచినట్లే.. ఇప్పుడు
ప్రధానమంత్రిగా తెలంగాణ మోడల్‌కు సహకరించాలని మోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు. బుధవారం పార్లమెంట్‌లోని పీఎంవోలో దాదాపు 30 నిమిషాలపాటు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు.
రీజినల్ రింగ్ రోడ్డు, దానికి సమాంతరంగా రైల్వే లైన్ పనులకు అనుమతి ఇవ్వాలని సీఎం కోరారు. మన్ననూరు – శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్ – బెంగళూరు – చెన్నై బుల్లెట్ ట్రైన్, ఇతర పెండింగ్ ప్రాజెక్ట్‌లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు అనుమతులు ఇవ్వాలని, మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవునా విస్తరించే ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందని ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రూ.43,848 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా తీసుకెళ్లేందుకు ఆమోదించాలన్నారు.
రింగ్ రైలు ప్రాజెక్టును త్వరగా చేపట్టాలి
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగానికి కేబినెట్ ఆమోదంతో పాటు ఫైనాన్సియల్ అప్రూవల్ ఇవ్వాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి రిక్వెస్ట్ చేశారు. దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. రీజినల్ రింగ్ రోడ్డు వెంట ప్రతిపాదనల్లో ఉన్న రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టును వీలైనంత త్వరగా చేపట్టాలన్నారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12 లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగుళూరు హై స్పీడ్ కారిడార్ ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని ప్రధానికి ఆయన విజ్క్షప్తి చేశారు.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయంగా రవాణా సదుపాయం ఉండేలా టైగర్ రిజర్వ్ మీదుగా మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఫోర్ లేన్ ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలన్నారు.
గుజరాత్ మోడల్‌కు నాడు ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ సహకరించిన మాదిరిగానే... ప్రస్తుతం తెలంగాణ మోడల్‌కు ప్రధానమంత్రిగా సహకరించాలని మోదీని తాను కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ‘‘యూపీఏ హయాంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ ముందుకు అప్పట్లో సీఎంగా మీరు గుజరాత్ మోడల్‌ను తీసుకువచ్చారని ప్రధాని మోదీకి గుర్తుచేశాను. ఆ రోజు ప్రధానిగా మన్మోసింగ్ పెద్ద మనసుతో స్పందించి గుజరాత్ మోడల్‌కు సహకరించారు.
ఆ సహకారంతోనే గుజరాత్ ను మోడల్‌గా అభివృద్ధి చేయగలిగారు. అలాగే సీఎంగా తెలంగాణ మోడల్ కు సహకరించాలని నేను కోరుతున్న అని మోదీకి తెలియజేశాను’’ అని సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో అన్నారు. ఇందుకు ప్రధాని మోదీ స్పందిస్తూ.. తెలంగాణ అభివృద్ధి నమూనాకు సహకరిస్తానని హామీ ఇచ్చారని సీఎం తెలిపారు. తప్పనిసరిగా అవసరమైన సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారని ఆయన అన్నారు.
విజయేంద్ర ప్రసాద్‌ను పలకరించిన సీఎం
ప్రధాని మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్, కేంద్ర మంత్రులకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఆహ్వానం అందించేందుకు పార్లమెంట్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. అక్కడ కనిపించిన సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ (డైరెక్టర్ రాజమౌళి తండ్రి)ను ఆత్మీయంగా పలకరించారు.
కేంద్రం మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో భేటీ అనంతరం మరో మంత్రిని కలిసేందుకు సీఎం ముందుకు సాగారు. ఆ దారిలో కూర్చొని ఉన్న విజయేంద్ర ప్రసాద్ ను చూసి సీఎం రేవంత్ రెడ్డి ఆగి పలకరించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి కాసేపు పలు అంశాలపై ఆహ్లాదంగా ముచ్చటించారు. తర్వాత ఏపీ ఎంపీ, ఒకప్పటి సహచర ఎంపీ మిథున్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు.
