గ్లోబల్ సమిట్‌‌కు రండి..ప్రధాని మోదీ, రాహుల్, సోనియా, పలువురు కేంద్ర మంత్రులకు ఆహ్వానం

గ్లోబల్ సమిట్‌‌కు రండి..ప్రధాని మోదీ, రాహుల్, సోనియా, పలువురు కేంద్ర మంత్రులకు ఆహ్వానం
  • పార్లమెంట్‌‌లో‌‌ కలిసి ఇన్విటేషన్‌‌ అందజేసిన సీఎం రేవంత్​
  • సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి, కాంగ్రెస్​ ఎంపీలు
  • విజన్‌ 2047 డాక్యుమెంట్‌ లక్ష్యంపై ప్రధానికి వివరణ

న్యూఢిల్లీ, వెలుగు:అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ భారత్ ఫ్యూచ ర్​ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ –2047​ గ్లోబల్​ సమిట్‌‌‌‌‌‌‌‌కు రావాలంటూ  ప్రధాని మోదీని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు.  అలాగే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ (సీపీపీ) సోనియా గాంధీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,  పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఇన్విటేషన్ అందజేశారు.

 బుధవారం పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో ప్రధాని మోదీతో సీఎం రేవంత్​ సమావేశం అయ్యారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, కుందూరు రఘువీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సురేశ్‌‌‌‌‌‌‌‌ షెట్కార్, డాక్టర్ కడియం కావ్య, అనిల్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాదవ్ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్ సమిట్ ఆహ్వాన పత్రికను ప్రధానికి సీఎం అందించారు.

 అనంతరం కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న వికసిత్ భారత్–2047 లక్ష్యాలకు తగ్గట్టుగా.. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతున్నదని ప్రధానికి వివరించారు. అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ  రైజింగ్ –2047  విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు  చెప్పారు.  నీతి అయోగ్ సలహాలు, సూచనలతోపాటు అన్ని రంగాల నిపుణుల మేధో మథనంతో తయారు చేసిన ఈ విజన్ డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌ను గ్లోబల్ సమిట్‌‌‌‌‌‌‌‌లో ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా చేపడుతున్న  అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ సహాకారాలు అందించాలని కోరారు. 

సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో భేటీ..

ప్రధానితో భేటీ అనంతరం లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌‌‌‌‌‌‌‌గాంధీని పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లోని ఆయన ఆఫీసులో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమిట్‌‌‌‌‌‌‌‌కు రావాలని ఆహ్వానించారు.  అదే చాంబర్ లో ఉన్న ప్రియాంక గాంధీకి సైతం ఆహ్వానం పలికారు. వారిద్దరికీ సమిట్‌‌‌‌‌‌‌‌లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్ గురించి వివరించారు.  

10 జన్ పథ్‌‌‌‌‌‌‌‌లో సీపీపీ చైర్మన్ సోనియా గాంధీని డిప్యూటీ భట్టి, ఎంపీలతో కలిసి సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ అభివృద్ధి, అంతర్జాతీయస్థాయిలో రాష్ట్రాన్ని నిలిపేలా నిర్వహిస్తున్న సమిట్‌‌‌‌‌‌‌‌కు రావాలని కోరారు. అంతకుముందు పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో  కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్​ ఖట్టర్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌‌‌‌‌‌‌ను వేర్వేరుగా కలిసి ఇన్వైట్​ చేశారు.  

తెలంగాణ రైజింగ్ –2047 విజన్ డాక్యుమెంట్ గురించిన లక్ష్యాలను కేంద్ర మంత్రులకు సీఎం వివరించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటన ముగించుకొని, తిరిగి హైదరాబాద్ బయలుదేరారు.