ప్రతిష్టాపనకు సిద్ధంగా తెలంగాణ తల్లి... డిసెంబర్ 9న కలెక్టరేట్లలో విగ్రహాలు ప్రారంభం

ప్రతిష్టాపనకు సిద్ధంగా తెలంగాణ తల్లి... డిసెంబర్ 9న కలెక్టరేట్లలో విగ్రహాలు ప్రారంభం
  • 33 జిల్లాల్లో ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్‍ చర్యలు  
  • ఒక్కో విగ్రహానికి రూ.15.5 లక్షల నుంచి రూ.17.5 లక్షలు కేటాయింపు
  • ఐదు నెలల కిందట మొదలైన విగ్రహ నిర్మాణ పనులు  
  • ఇప్పటికే కలెక్టరేట్లకు చేరిన  విగ్రహాలు 
  • తుది మెరుగులు దిద్దుకుంటున్న  దిమ్మెలు

వరంగల్‍, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. గత ఐదారు నెలలుగా విగ్రహాల ప్రతిష్టాపన పనులు ముమ్మరంగా నడుస్తుండగా చివరి దశకు చేరాయి. రాష్ట్ర సాంస్కృతిక  చిహ్నమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతేడాది డిసెంబర్‍ 9న రాష్ట్ర రాజధాని హైదరాబాద్‍లోని సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 33 జిల్లాల్లోని కలెక్టరేట్ల ఆవరణలోనూ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.  

సెక్రటేరియట్ లో 20 అడుగులతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో కలెక్టరేట్లలో12 అడుగుల ఎత్తుతో ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇందుకు ఒక్కో విగ్రహానికి రూ.15.5 లక్షల నుంచి రూ.17.5 లక్షలను ప్రభుత్వం కేటాయించింది. కలెక్టరేట్ల లో విగ్రహం 12 అడుగులు, పీఠం 2 అడుగులు, దిమ్మె 4 అడుగులతో కలిపి మొత్తంగా 20 అడుగుల ఎత్తు ఉండనుంది. 

సబ్బండ వర్గాల ఆకాంక్షలకు స్ఫూర్తిగా

సంప్రదాయ పల్లెటూరి మహిళా రైతుగా, స్త్రీ మూర్తిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. పసుపు పచ్చ బంగారు అంచుతో కూడిన ఆకుపచ్చ చీరలో  ఉండి, తెలంగాణ సంప్రదాయ పంటలు మొక్కజొన్న, వరి, గోధుమ, సజ్జ కంకులు ఎడమ చేతిలో ఏర్పాటు చేశారు. నుదుటిపై ఎర్రని బొట్టు, కాళ్లకు కడియాలు, ముక్కు పుడక, చెవులకు కమ్మలు, మట్టి గాజులు, మెడలో గుండు పూసలు, హారం కలిగి చిరునవ్వుతో కూడిన విగ్రహాని కి ప్రముఖ శిల్పి ఎంవీ.రమణారెడ్డి, ప్రొఫెసర్‍ గంగాధర్‍ రూపకల్పన చేశారు. రాష్ట్ర సర్కార్‍ సబ్బండ వర్గాల ఆకాంక్షలకు స్ఫూర్తిగా నిలిచేలా విగ్రహాన్ని తయారు చేసింది. కలెక్టరేట్‍ ప్రతిష్టించబోయే తెలంగాణ తల్లి విగ్రహం వివిధ పనులపై వెళ్లే ప్రజలను ఆకట్టుకోనుంది.  

కలెక్టరేట్ ప్రధాన ద్వారానికి మధ్యలో ..

డిసెంబర్‍ 9న తెలంగాణ తల్లి దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని నిర్ణయించింది. ఇందుకు గత జులైలోనే పనులను సర్కారు ప్రారంభించింది.  అన్ని జిల్లాలోని ఆఫీసుల్లో విగ్రహాల ప్రతిష్టాపనకు ఒకే తరహాలో దిమ్మెలు నిర్మించారు. ఒకేచోట విగ్రహాలను తయారు చేయించి ఇప్పటికే జిల్లాలకు తరలించారు. 

వారం రోజులుగా విగ్రహాల ప్రతిష్టాపన పనులు నిర్వహిస్తుండగా చివరి దశకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి దినోత్సవాలన్ని ఘనంగా నిర్వహిస్తుండగా..  స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల సమక్షంలో విగ్రహాలను 
ఆవిష్కరిస్తారు.