హై పవర్ మందులూ పని చేయట్లే.. అధిక డోసునూ తట్టుకుంటున్న బ్యాక్టీరియాలు.. ప్రతి10 మందిలో ఒకరికి డేంజర్ బెల్స్

హై పవర్ మందులూ పని చేయట్లే.. అధిక డోసునూ తట్టుకుంటున్న బ్యాక్టీరియాలు.. ప్రతి10 మందిలో ఒకరికి డేంజర్ బెల్స్
  •  క్లెబ్సియెల్లా, ఈ-కోలి, తదితర బ్యాక్టీరియాలు
  • ప్రతి10 మందిలో ఒకరికి డేంజర్ బెల్స్
  • అతిశక్తిమంతమైన ‘లాస్ట్ హోప్’ మందు ‘కొలిస్టిన్’కూ లొంగట్లే 
  • మొండి బ్యాక్టీరియా బారిన పడినవాళ్లలో10% మందికి ఏ మందూ పారట్లే 
  • ఉస్మానియా, నిలోఫర్ హాస్పిటళ్ల స్టడీలో షాకింగ్ విషయాలు
  • 6,728 శాంపిల్స్‌‌ కు టెస్టులు.. 10.7% మందిలో మందులు ఫెయిల్ 
  • పెద్దల కంటే పిల్లల్లోనే ప్రమాదం రెట్టింపు 

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా, నిలోఫర్ హాస్పిటళ్ల స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. హై పవర్ మందులను, హై డోస్ లో ఇచ్చినా కూడా తట్టుకునేలా కొన్ని బ్యాక్టీరియాలు మరింత మొండిగా తయారవుతున్నాయని డాక్టర్లు గుర్తించారు. ఏ మందులకూ లొంగకుండా మొండిగా తయారయ్యే బ్యాక్టీరియాలను హతమార్చే అతి శక్తిమంతమైన యాంటీబయాటిక్ మందు కొలిస్టిన్. ఏ మందుతోనూ ఉపయోగం లేనప్పుడు డాక్టర్లు ఆఖరి అస్త్రంగా దీనిని వాడుతుంటారు. 

కానీ, ఈ హై పవర్ మందును కూడా తట్టుకునేలా ఇప్పుడు కొన్ని బ్యాక్టీరియాలు తయారవుతున్నాయని.. వీటి బారిన పడిన ప్రతి 10 మందిలో ఒకరికి ఈ ఆఖరి మందు కూడా పని చేయట్లేదన్న షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఈ ప్రమాదం రెండు రెట్లు ఎక్కువగా ఉందని తేలడం ఆందోళన కలిగిస్తున్నది. చిన్న చిన్న సమస్యలకే విచ్చలవిడిగా యాంటీబయాటిక్ మందులు తీసుకుంటుండటంతో ఇప్పుడు అత్యంత శక్తిమంతమైన యాంటీబయాటిక్స్ ను కూడా తట్టుకునేలా బ్యాక్టీరియా మారుతోందని ఈ స్టడీ హెచ్చరిస్తున్నది.  

 ఉస్మానియా, నిలోఫర్ హాస్పిటల్స్ లో స్టడీ  

ఉస్మానియా, యాదాద్రి, జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన మైక్రోబయాలజీ ప్రొఫెసర్లు డాక్టర్ మధురిమ, డాక్టర్ ఉదయశ్రీ, డాక్టర్ ఉజ్మా జబీన్, డాక్టర్ జ్యోతిలక్ష్మి బృందం చేసిన ఈ స్టడీ వివరాలు ఇటీవల ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లో పబ్లిష్ అయ్యాయి. టెర్షరీ కేర్ సెంటర్లు అయిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నిలోఫర్ హాస్పిటల్స్ లో జూన్ 2023 నుంచి మే 2024 వరకు ఏడాది పాటు ఈ స్టడీ నిర్వహించారు. 

హాస్పిటల్స్ కు వచ్చిన పీడియాట్రిక్, అడల్ట్ పేషెంట్ల నుంచి రక్తం, యూరిన్, గాయాల చీముకు సంబంధించి మొత్తం 6,728 శాంపిల్స్ సేకరించారు. అందులో సాధారణ మందులు అయిన పెన్సిలిన్, కార్బపెనెమ్ వంటి వాటికి కూడా లొంగని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్(ఎండీఆర్) బ్యాక్టీరియా ఉన్న 625 సీరియస్ కేసులను గుర్తించారు. వీరికి సాధారణ యాంటీబయాటిక్స్ పనిచేయవు. వీరికి ఉన్న ఏకైక దిక్కు కొలిస్టిన్ మందు మాత్రమే. దీన్నే మెడికల్ భాషలో ‘లాస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్’ అని కూడా పిలుస్తున్నారు. 

10.7 శాతం మందిలో మందు ఫెయిల్  

ఈ 625 మొండి కేసులపై.. మైక్రో బ్రాత్ డైల్యూషన్ అనే అధునాతన పద్ధతిలో కొలిస్టిన్ మందును ప్రయోగించారు. ఈ 625 మందిలో ఏకంగా 67 మందికి(10.7%) ఈ లాస్ట్ హోప్ డ్రగ్ కూడా పనిచేయలేదు. అంటే, ప్రతి 100 మంది సీరియస్ పేషెంట్లలో 11 మందిని కాపాడే మందు ప్రస్తుతం డాక్టర్ల దగ్గర లేదన్నమాట. మిగిలిన 558 (89.28%) మందికి మాత్రమే ఈ మందు పనిచేసింది. మందులు పనిచేయని వారిలో స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా ఉన్నారు. 258 మంది పురుషులకు టెస్ట్ చేస్తే 29 మందికి (11.24%) ఈ మందు ఫెయిల్ అయ్యింది. అలాగే 367 మంది స్త్రీలను టెస్ట్ చేస్తే 38 మందికి(10.35%) సైతం ఈ మెడిసిన్ పని చేయలేదు. 


పిల్లల్లోనే ప్రమాదం ఎక్కువ 


పెద్దల కంటే చిన్నపిల్లల్లోనే ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. నిలోఫర్ నుంచి సేకరించిన 320 మంది పిల్లల శాంపిల్స్‌‌ ను టెస్ట్ చేస్తే.. అందులో 45 మందికి (14%) ఈ లాస్ట్ హోప్ మందు అయిన కొలిస్టిన్  పని చేయలేదు. 

ఉస్మానియా నుంచి సేకరించిన 305 మంది పెద్దవారిలో 22 మందికి (7.2%) మాత్రమే రెసిస్టెన్స్ వచ్చింది. దీన్ని బట్టి చూస్తే పెద్దవారితో పోలిస్తే పిల్లల్లో ఈ ప్రమాదం ఎక్కువగా, దాదాపు రెట్టింపుగా ఉన్నది. చిన్నప్పటి నుంచే విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడటం వల్లే చిన్నారుల ప్రాణాలు రిస్క్‌‌ లో పడుతున్నాయని ఈ లెక్కలు చెబుతున్నాయి.  

రక్తంలో కలిస్తే ప్రాణాలకే ముప్పు 

శరీరంలో ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉంటే ప్రమాదం ఎక్కువ అనేది కూడా ఈ స్టడీ వివరించింది. బ్యాక్టీరియా రక్తంలోకి చేరితే అత్యంత ప్రమాదమని తేల్చింది. బ్లడ్ శాంపిల్స్‌‌ లో బ్యాక్టీరియా ఉన్న వారిలో అత్యధికంగా13.75 శాతం మందికి కొలిస్టిన్ పని చేయలేదు. 

టెస్ట్ చేసిన 80 బ్లడ్ శాంపిల్స్‌‌లో 11 శాంపిల్స్ కు మందులు ఫెయిల్ అయ్యాయి. అలాగే మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో 11.84% రెసిస్టెన్స్ ఉంది.  టెస్ట్ చేసిన 380 శాంపిల్స్‌‌ లో 45 మందికి ఈ మందు పనిచేయలేదు. గాయాల నుంచి వచ్చే చీము శాంపిల్స్‌‌ లో 6.66% మందికి కూడా బ్యాక్టీరియా లొంగలేదు. టెస్ట్ చేసిన165 శాంపిల్స్‌‌లో 11 ఫెయిల్ అయ్యాయని గుర్తించారు. 

విచ్చలవిడిగా మందులు వాడొద్దు 

ఎంత మొండి బ్యాక్టీరియానైనా హతమార్చి, మనుషుల ప్రాణాలు కాపాడే కొలిస్టిన్ మందు1950లలోనే వచ్చినా.. కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వాడటం ఆపేశారు. కానీ ఇప్పుడు వేరే మందులు పని చేయకపోవడంతో మళ్లీ దీన్నే వాడుతున్నారు. ఇప్పుడు దీనికి కూడా బ్యాక్టీరియా అలవాటు పడిపోవడం మానవాళికి ఇది ఒక హెచ్చరిక లాంటిదని డాక్టర్లు చెబుతున్నారు. 

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా జలుబు, దగ్గుకు కూడా యాంటీబయాటిక్స్ వాడటం, కోర్సు మధ్యలోనే మందులు ఆపేయడం వల్లే బ్యాక్టీరియా ఇలా మొండిగా తయార వుతున్నదని, ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే చిన్న చిన్న గాయాలు కూడా ప్రాణాంతకంగా మారుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.