ఓబ్లాయిపల్లి గ్రామంలో సఫాయి కార్మికుడే సర్పంచ్‌‌‌‌

 ఓబ్లాయిపల్లి గ్రామంలో సఫాయి కార్మికుడే సర్పంచ్‌‌‌‌
  • ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు గ్రామస్తుల తీర్మానం

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ రూరల్‌‌‌‌, వెలుగు : మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా రూరల్‌‌‌‌ మండలంలోని ఓబ్లాయిపల్లి గ్రామంలో ఇన్నాళ్లు సఫాయిగా పనిచేసిన వ్యక్తే ఇప్పుడు ఆ గ్రామానికి సర్పంచ్ కాబోతున్నాడు. ఓబ్లాయిపల్లి సర్పంచ్‌‌‌‌ పదవి జనరల్‌‌‌‌కు రిజర్వ్‌‌‌‌ అయింది. దీంతో గ్రామానికి చెందిన మల్టీపర్పస్‌‌‌‌ వర్కర్‌‌‌‌ బత్తిని కృష్ణయ్యతో పాటు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు, మరో ఇండిపెండెంట్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ నామినేషన్లు వేశారు. 

సర్పంచ్‌‌‌‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని భావించిన గ్రామస్తులు బుధవారం స్థానికంగా సమావేశమై చర్చించారు. ఈ క్రమంలో మల్టీపర్పస్‌‌‌‌ వర్కర్‌‌‌‌గా పనిచేస్తున్న కృష్ణయ్యను సర్పంచ్‌‌‌‌గా ఎన్నుకోవాలని తీర్మానించారు. దీంతో మిగతా పోటీదారులు బుధవారం సాయంత్రం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం కృష్ణయ్య ఒక్కడే పోటీలో ఉండడంతో అతడే ఓబ్లాయిసర్పంచ్‌‌‌‌గా ఏకగ్రీవం కానున్నాడు. దీంతో కృష్ణయ్యను గ్రామస్తులు సన్మానించారు.