రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటం

రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటం

అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోయారని..వారి జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటం అడుతున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇప్పటి వరకు పంటనష్టం అంచనా కూడా వేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కోటి ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, సోయా పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. మహారాష్ట్ర, ఏపీ ప్రభుత్వాలు కేంద్రంతో సంబంధం లేకుండా ఎకరానికి పదివేలు పరిహారం ఇస్తామని ప్రకటించాయని చెప్పారు జీవన్ రెడ్డి.

ఇటీవల వర్షాలు, వరదలకు తెలంగాణాలో కోటి ఎకరాల వరకు పంట దెబ్బతిన్నదన్నారు. ఎకరాకు 10 వేలు నష్టం అంచనా వేస్తే 10 లక్షల కోట్లు పంట దెబ్బతిన్నట్టు లెక్క.  కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం వెయ్యికోట్ల పంట నష్టపోయినట్లు కేంద్రానికి నివేదిక ఇవ్వడం దారుణమన్నారు జీవన్ రెడ్డి. రైతులు ఎకరాకు 20వేలు నష్టపోయారని.. రైతుబందుతో కేవలం 5వేలు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు.

అంతేకాదు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ప్రారంభం కాలేదని ఆరోపించారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మన దగ్గర కూడా ఎకరాకు పదివేలు పరిహారం ఇవ్వాలన్నారు. సన్నారకం వరి ధాన్యాన్ని క్వింటాలుకు 2500 ఇచ్చి ప్రభుత్వమే కొనాలన్నారు.

యూపీఏ అధికారంలో ఉండగానే నిజామాబాద్ లో ల్యాండ్ రికార్డ్ అప్డేట్ కార్యక్రమం ప్రారంభమైందన్న జీవన్ రెడ్డి..కేంద్ర ప్రభుత్వ ఆలోచనలో భాగమే ధరణి అన్నారు. అంతేకాదు ధరణి కి కేంద్రమే నిధులు సమకూర్చుతోందన్నారు.