మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభంపై గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారి కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ(మంగళవారం) జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. మంత్రివర్గ సమావేశం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడానికి అంగీకారం తెలిపింది. కేబినెట్ తీర్మాణాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించారు. దీంతో మహారాష్ట్రలో 20 రోజులుగా నడుస్తున్న ఉత్కంఠకు తెరపడి…గవర్నర్ రూల్ అమల్లోకి వచ్చింది.
అంతకు ముందు శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం మూడు రోజుల సమయం కావాలని అడిగినా గవర్నర్ తక్కువ సమయాన్ని ఇచ్చారంటూ పిటిషన్ వేసింది. బీజేపీకి 48 గంటల సమయాన్ని గవర్నర్ ఇచ్చారని.. తమకు మాత్రం 24 గంటల సమయాన్ని మాత్రమే ఇచ్చారని తెలిపింది. రాష్ట్రపతి విధించిడంపై కూడా సుప్రీం కోర్టులో మరో ఫిటిషన్ వేసేందుకు శివసేన రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

