ఎల్ఐసీ, బ్యాంకుల సీఎండీల నియామకానికి గ్రీన్​ సిగ్నల్

ఎల్ఐసీ, బ్యాంకుల సీఎండీల నియామకానికి గ్రీన్​ సిగ్నల్

హైదరాబాద్, వెలుగు: సింగరేణి సీఎండీగా ఉన్న శ్రీధర్​కు కేంద్రం అడ్డుకట్ట వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ మినరల్స్ డెవలప్​మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) చైర్మన్​గా శ్రీధర్​ను పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సెలక్షన్ బోర్డు(పీఈఎస్​బీ ) గత నెల18న  సెలక్ట్ చేసింది. ఈ నియామక ఆమోదం కోసం డీవోపీటీ(డిపార్ట్​మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్)కి పంపింది. అయితే, నెల దాటినా ఇంతవరకు శ్రీధర్ నియామకాన్ని కేంద్రం ఆమోదించలేదు. ఎన్ఎండీసీ చైర్మన్ సుమిత్ దేవ్ పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 28న ముగిసింది. అప్పటి నుంచి ఇన్​చార్జ్​ సీఎండీగా ఎన్ఎండీసీ ఫైనాన్స్ డైరెక్టర్ అమితవ్ ముఖర్జీ కొనసాగుతున్నారు. ఇటీవలే కేంద్రం పలు సంస్థల చైర్మన్ల నియామకాలకు ఆమోదం తెలిపింది. ఇందులో ఎల్ఐసీ చైర్మన్​ సిధార్థ మహంతి, బ్యాంక్ ఆఫ్ బరోడా సీఎండీ దేవదత్త చంద్​ నియామకాలకు గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది. శ్రీధర్ నియామకాన్ని మాత్రం పెండింగ్​లో పెట్టింది. 

శ్రీధర్ ను కొనసాగించొద్దు

సింగరేణి సీఎండీగా శ్రీధర్ 2015 జనవరి 1 నుంచి కొనసాగుతున్నారు. సింగరేణిలో సీఎండీ మినహా 9 మంది డైరెక్టర్లు ఉండగా, నలుగురు సింగరేణి నుంచి, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ముగ్గురు కేంద్రం నుంచి డైరెక్టర్లుగా ఉన్నారు. 2021 లో సీఎండీ పదవీకాలాన్ని కేంద్ర అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఏడో ఏడాది పొడిగించడం వివాదాస్పదమైంది. సీఎండీ నియామకాన్ని సవాల్ చేస్తూ సింగరేణి మాజీ ఉద్యోగి హైకోర్టులో  పిల్ వేయగా కేంద్రం స్పందిస్తూ ఆఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న అగ్రిమెంట్ లోని క్లాస్ 4 ప్రకారం మొదటగా మూడేండ్లు, ఆపై రెండేండ్ల పదవీకాలం పెంచటానికి మాత్రమే రూల్స్ అనుమతిస్తున్నాయి. ఈ విషయమై 2021 లో కేంద్ర కోల్ సెక్రటరీ అనిల్ కుమార్ జైన్ అప్పటి సీఎస్ సోమేశ్​కుమార్ కు లేఖ రాశారు. “కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీఎండీ పదవీకాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే ఆ  పొడిగింపు ఉత్తర్వులు రద్దు చేసి కొత్త ప్రపోజల్ పంపండి ”అని లేఖలో పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.