దక్షిణాది సినిమాలపై కేంద్రం వివక్ష : మంత్రి శ్రీనివాస్ గౌడ్

దక్షిణాది సినిమాలపై కేంద్రం వివక్ష : మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఆస్కార్ అవార్డు దక్కించుకున్న త్రిబుల్ ఆర్ బృందానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందనలు తెలిపారు. తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం గర్వకారణమని చెప్పారు. ఆ పాట రాసిన రచయిత చంద్రబోస్, పాడిన గాయకుడు రాహుల్ సిప్లి గంజ్ తెలంగాణ బిడ్డలు కావడం గర్వంగా ఉందన్నారు. ఈ సినిమాపై కేంద్ర వివక్ష ధోరణి కనిపించిందని, మొదటి నుంచి దక్షిణాది భారతదేశ  సినిమాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని మంత్రి మండిపడ్డారు. ఇప్పుడు మొఖం ఎక్కడ పెట్టుకుంటారో చూడాలన్నారు. 

సినిమా టీమ్ ను పిలిపించి త్వరలో రవీంద్రభారతిలో ఘనంగా సన్మానిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సినిమా షూటింగ్ లకు తక్కువ ఖర్చుతో పర్యాటక క్షేత్రాలలో, హోటల్ లలో అవకాశం కల్పిస్తామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో అన్ని రంగాలతో పాటు సినీ రంగం కూడా భవిష్యత్తులో సినీ హబ్ గా మారబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వ్యత్యాసాలు చూపించకుండా అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా చూడాలని మంత్రి కోరారు.