కృష్ణా, గోదావరిపై గెజిట్​ను వాపస్ తీస్కోవాలి

కృష్ణా, గోదావరిపై గెజిట్​ను వాపస్ తీస్కోవాలి
  • ‘కృష్ణా, గోదావరి’పై కేంద్రం గెజిట్ ఎత్తివేయాలి
  • తెలంగాణ డెవలప్​మెంట్  ఫోరం డిమాండ్

షాద్​నగర్, వెలుగు: కృష్ణా, గోదావరి నదులపై కేంద్ర జలశక్తి శాఖ తెచ్చిన గెజిట్​ను వాపస్ తీస్కోవాలని తెలంగాణ డెవలప్​మెంట్ ఫోరం డిమాండ్ చేసింది. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రొఫెసర్ కోదండ రాం, సీనియర్ సంపాదకుడు రామచంద్రమూర్తి, కాంగ్రెస్ షాద్​నగర్ ఇన్​చార్జి వీర్లపల్లి శంకర్, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం, రామచంద్రమూర్తి మాట్లాడారు. జలశక్తి శాఖ తెచ్చిన గెజిట్​తో ఇక్కడి నీళ్లు ఇతర ప్రాంతాలకు తరలిపోయే పరిస్థితి ఉందని, వెంటనే ఆ గెజిట్​ను వాపస్ తీస్కోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

నదులపై పెత్తనం కేంద్రానికి లేదని, రాష్ట్రాలదేనని రాజ్యాంగమే చెప్తోందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భాగంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్​ను నిర్మించాలని, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, దక్షిణ తెలంగాణ రైతులకు తాగు, సాగు నీళ్లందించాలన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ ఫోన్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. దక్షిణ తెలంగాణ జిల్లాలకు తాగు, సాగు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రాఘవాచారి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి పెండింగ్​లో ఉన్న వ్యవసాయానికి ఉపయోగపడే ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.