మహబూబాబాద్ కలెక్టర్ బదిలీతో.. సంబరాలు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బిసీ సంఘాల నాయకులు

మహబూబాబాద్ కలెక్టర్ బదిలీతో.. సంబరాలు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బిసీ సంఘాల నాయకులు

మహబూబాబాద్, వెలుగు: రెండేళ్లుగా మహబూబాబాద్​ కలెక్టర్​గా పని చేస్తున్న అద్వైత్​ కుమార్​ సింగ్​ బదిలీ  కావడంతో జిల్లా కేంద్రంలోని తహసీల్దార్​ సెంటర్​లో ఎస్టీ, ఎస్సీ, బీసీ సంఘాల నాయకులు సంబరాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్​ భీమా నాయక్  మాట్లాడుతూ ఆయన కారణంగా మానుకోట జిల్లా అభివృద్దిలో వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలను చులకనగా చూడడం, ప్రజల అర్జీలను చెత్తబుట్టలో వేసి ఆనందించే వ్యక్తి అని విమర్శించారు. గ్రీవెన్స్​ రోజు మినహా ఇతర రోజుల్లో ప్రజలను కలవడని తెలిపారు. ఆఫీసుల్లో కూర్చొని ప్రతిరోజు ఖరీదైన స్నాక్స్, డ్రింక్స్, ఫ్రూట్స్, బిస్కెట్లు ఆరగిస్తూ కాలం గడిపాడని విమర్శించారు. భూసమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఔట్​ సోర్సింగ్​ నియమకాలు చేపట్టలేదని, కలెక్టర్​ స్పెషల్​ ఫండ్​ను వినియోగించలేదన్నారు. 

ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులోనూ నిర్లక్ష్యం చూపాడని విమర్శించారు. పాలనను ఏమాత్రం పట్టించుకోలేదని, ఆయన మూలంగా జిల్లా పూర్తిగా వెనుకబాటుకు గురైందని తెలిపారు. ఎల్ హెచ్ పీఎస్  జిల్లా అధ్యక్షుడు బోడా రమేశ్ నాయక్, మాజీ వైస్​ ఎంపీపీ ఎల్ది మల్లయ్య, రవి పాల్గొన్నారు.