1500 ఎస్టీ పంచాయతీలకు బిల్డింగ్స్

1500 ఎస్టీ పంచాయతీలకు బిల్డింగ్స్
  •     ఒక్కో భవనానికి ఉపాధి హామీ కింద రూ.20 లక్షలు
  •     4,745 జీపీ ఆఫీసుల నిర్మాణం
  •     ఖర్చు చేసుకునేందుకు అనుమతిచ్చిన కేంద్రం

హైదరాబాద్, వెలుగు: కేంద్రం ఇచ్చిన ఉపాధి హామీ నిధులతో రాష్ట్రంలో సొంత భవనాలు లేని గ్రామ పంచాయతీల్లో కొత్త ఆఫీస్​లు నిర్మిం చనున్నారు. ఉపాధి హామీ నిధులతో జీపీ బిల్డింగ్​లు కట్టుకునేందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఒక్కో బిల్డింగ్​కు ఎంజీఎన్​ఆర్​ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలు వాడుకోవచ్చని ప్రకటించింది. దీంతో జీపీల్లో కొత్త బిల్డింగ్​లు కట్టేందుకు ఉపాధి హామీ నిధులను ఉపయోగించుకోవాలంటూ రాష్ట్ర సర్కారు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఇప్పటికే జాబితా తెప్పించుకుని పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 

1500 ఎస్టీ పంచాయతీలకు బిల్డింగ్స్

రాష్ట్రంలో 2019కు ముందు 8,386 పంచాయతీలు ఉండేవి. 500 జనాభా కలిగిన 4,383 తం డాలు, గూడేలను పంచాయతీలుగా అప్ గ్రేడ్ చేయడంతో రాష్ట్రంలో జీపీల సంఖ్య 12,769కి చేరింది. ఇందులో ప్రస్తుతం 4,745 జీపీలకు సొంత భవనాల్లేవని అధికారులే తేల్చారు. వీటి లో 1,097 తండాలు, ఏజెన్సీ ప్రాంతాల్లోని 688 ఆదివాసీ గూడేలు ఉన్నాయి. మైదాన ప్రాంతాల్లో 2,960 జీపీలకు భవనాలు లేవు. కొత్త పంచాయతీలన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని పంచాయతీల్లో కొత్త బిల్డింగ్​ల పనులు ప్రారంభించగా.. మరికొన్నింటి పనులు శంకుస్థాపన దశలోనే ఉన్నాయి. ఇప్పటివరకు నిధుల కొరత కారణంగా కొత్త బిల్డింగ్​ల నిర్మాణంపై నిర్ణయం తీసుకోని ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు స్పెషల్ డెవలప్​మెంట్ ఫండ్ (ఎస్టీఎస్డీఎఫ్), ఉపాధి హామీ నిధులను ఖర్చు పెట్టి నిర్మించాలని నిర్ణయించారు. ఈ అంశంపై మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాథోడ్  ఈమధ్యే రివ్యూ చేపట్టారు. మంత్రుల ఆదేశం మేరకు పీఆర్ అధికారులు 1500 ఎస్టీ పంచాయతీల కొత్త బిల్డింగ్​ల ప్రపోజల్స్ ఖరారు చేసే పనిలో పడ్డారు. త్వరలో ప్రభుత్వానికి పంపుతామని చెప్తున్నారు. వీటి నిర్మాణాలకు ఎస్టీఎస్డీఎఫ్​ నిధులు రూ.300 కోట్లు, ఉపాధి హామీ నిధులు ఖర్చు చేయనున్నారు.

976 స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ ప్లాన్ రెడీ

రాష్ట్ర పంచాయతీ అధికారులు రూ.20 లక్షల బడ్జెట్​లో బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసేలా రెండు ప్లాన్లను రెడీ చేశారు. ఒక్కో జీపీ బిల్డింగ్ 976 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ముందు వరండా, ఎంట్రెన్స్ లాబీ, కాన్ఫరెన్స్ హాల్, సర్పంచ్, పంచాయతీ సెక్రటరీలకు చెరో చాంబర్, టాయిలెట్లు వేర్వేరుగా ఉంటాయి. నిర్మాణం పూర్తయితే గ్రామ సభలు, సమావేశాలు పెట్టుకునేందుకు సర్పంచ్ లు, సెక్రటరీలు, ప్రజలకు ఇబ్బందులు తప్పనున్నాయి.