న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఎన్నికల సంస్కరణలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ప్రతిపక్షాల డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. 2025, డిసెంబర్ 1 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంట్ ఉభయ సభల్లో ఎన్నికల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR), ఎన్నికల సంస్కరణలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.
ఇందుకు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ప్రతిపక్షాలు సభలో ఆందోళనకు దిగాయి. ప్రతిపక్షాల నిరసనలతో ఉభయ సభలు రెండు రోజులు ఎలాంటి సభా కార్యకలాపాలు జరగకుండానే వాయిదా పడ్డాయి. దీంతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం (డిసెంబర్ 2) అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఆల్ పార్టీ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
►ALSO READ | 2027 జనాభా లెక్కలపై బిగ్ అప్డేట్.. జనగణన తేదీలు ప్రకటించిన కేంద్రం..!
ఈ నిర్ణయాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో డిసెంబర్ 8న వందేమాతరంపై చర్చ, అలాగే సెంబర్ 9వ తేదీ ఎన్నికల సంస్కరణలపై చర్చను నిర్వహించాలని నిర్ణయించారని తెలిపారు. సర్ వ్యాయామంపై స్వతంత్ర చర్చను ఆయన తోసిపుచ్చారు.
ఇది పూర్తిగా ఎన్నికల కమిషన్ పరిపాలనా నిర్ణయం అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఎన్నికల సంస్కరణలపై సభలో విస్తృత చర్చకు ఆయన అంగీకరించారు.. ఎందుకంటే ఇది ప్రభుత్వ అధికారం పరిధిలోకి వస్తుందని తెలిపారు. అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రతిష్టంభన తొలిగిపోవడంతో బుధవారం (డిసెంబర్ 3) నుంచి లోక్‌సభ సజావుగా జరిగే అవకాశం ఉంది.
